చీకోడులో స్కిల్ యూనివర్సిటీ

 చీకోడులో స్కిల్ యూనివర్సిటీ
  • 50 ఎకరాల భూసేకరణకు సమాయత్తం    
  • రేపటి నుంచి రెవెన్యూ అధికారుల సర్వే

సిద్దిపేట/దుబ్బాక, వెలుగు: దుబ్బాక మండలం చీకోడు వద్ద యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇటీవల దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సీఎంను కలిసి విన్నవించడంతో  స్కిల్ యూనివర్సిటీని మంజూరుకు సానుకూలంగా స్పందించారు. దీంతో అవసరమైన భూ సేకరణ  కోసం సీఎంవో ఆదేశాల మేరకు అధికారులు సర్వేకు రెడీ అవుతున్నారు. మొదటగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు దుబ్బాక మండలంలోని హబ్షీపూర్ ప్రాంతాన్ని ప్రాతిపాదించారు. 

మెదక్  నేషనల్ హైవే సమీపంలో 17 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నా సరిపోదనే ఉద్ధేశంతో అధికారులు చీకోడు వైపు మొగ్గు చూపారు. ఇక్కడ వర్సిటీ కోసం  50 ఎకరాల స్థలాన్ని సేకరించాలని నిర్ణయించారు.  టెక్నాజీకి అనుగుణంగా యువతను తీర్చీ దిద్దే విధంగా స్కిల్ యూనివర్సిటీ దుబ్బాక ప్రాంత యువత స్వయం ఉపాధికి దోహదపడే అవకాశం ఉంది.

నేటి నుంచి భూముల సర్వే

చీకోడులో స్కిల్ యూనివర్సిటీ కోసం శుక్రవారం నుంచి రెవెన్యూ అధికారులు సర్వేకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాంతంలో అసైన్డ్ భూములు ఎక్కువగా ఉండడంతో స్కిల్ వర్సిటీకి అవసరమైన విధంగా భూములు సేకరించనున్నారు. ప్రతిపాదిత స్థలంలో వివిధ వర్గాల వారికి ఎకరం నుంచి ఎకరన్నర వరకు 1972 లో ప్రభుత్వం భూములు కేటాయించింది. ఇందులో 50 మంది రైతులుండగా వారిలో  కొందరు వర్షాధార పంటలు సాగు చేస్తుండగా మిగిలిన భూములు ఖాళీగా ఉంచారు. సర్వేలో భాగంగా ప్రాతిపాదిత భూముల్లో ఎవరు సాగు చేస్తున్నారు, పడావు భూములెన్ని అనే విషయాన్ని గుర్తించనున్నారు.

నియోజకవర్గ అభివృద్ధికి దోహదం

దుబ్బాకలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే యువతకు ఉపాధికి అవకాశాలు మెరుగవుతాయి. ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుందని అందరూ భావిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రానికి పది కిలో మీటర్ల దూరంలోనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రతిపాదించడం వల్ల స్థానికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. సాగు చేయని అసైన్డ్ భూములను సేకరించే విధంగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నా క్షేత్ర స్థాయిలో రైతుల స్పందన ఏ విధంగా ఉంటుందనే విషయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.