అద్భుతం.. అద్వితీయం.. రెండోసారి విమెన్స్‌‌ అండర్‌‌‌‌-19 వరల్డ్ కప్‌‌ నెగ్గిన యంగ్ ఇండియా

అద్భుతం..  అద్వితీయం.. రెండోసారి విమెన్స్‌‌ అండర్‌‌‌‌-19 వరల్డ్ కప్‌‌ నెగ్గిన యంగ్ ఇండియా
  • అమ్మాయిల జయభేరి
  • తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష ఆల్‌‌రౌండ్ షో
  • ఫైనల్లో 9 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై ఘన విజయం
  •  జట్టును గెలిపించిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష
  • ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, టోర్నీ అవార్డులు సొంతం

ప్రపంచ వేదికపై మన అమ్మాయి మళ్లీ గెలిచింది. అద్భుతమైన ఆటతో.. అసాధారణ పోరాట పటిమతో.. అద్వితీయ ఘనత సాధించింది. అంచనాలను అందుకుంటూ.. ఆరంభం నుంచి ఆఖరి వరకు ఆధిపత్యం కనబరుస్తూ.. విమెన్స్‌‌ అండర్‌‌‌‌19 టీ20 వరల్డ్ కప్‌‌లో  యంగ్‌‌ ఇండియా మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. మలేసియా గడ్డపై అజేయ యాత్రను కొనసాగించిన అమ్మాయిల జట్టు ఫైనల్లో సౌతాఫ్రికాను చిత్తు చేసి రెండోసారి కప్పు సొంతం చేసుకుంది. 

ఈ విజయంలో తెలంగాణ ముద్దు బిడ్డ,  భద్రాచలం ఆడబిడ్డ గొంగడి త్రిష అత్యంత కీలక పాత్ర పోషించింది. టోర్నీలో గొప్పగా ఆడి టాప్ స్కోరర్‌‌‌‌గా నిలిచిన త్రిష ఫైనల్లోనూ చెలరేగింది. బౌలింగ్‌‌లో  3 వికెట్లు పడగొట్టి.. బ్యాటింగ్‌‌లోనూ  సత్తా చాటి జట్టును గెలిపించింది.  ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌తో పాటు  టోర్నమెంట్ అవార్డులు అందుకుంది. 

కౌలాలంపూర్‌‌‌‌: ఇండియా సీనియర్ విమెన్స్‌ టీమ్ ఇప్పటిదాకా ఒక్క ఐసీసీ ట్రోఫీ నెగ్గింది లేదు. కానీ, తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష (3/15, 33 బాల్స్‌‌లో 8 ఫోర్లతో 44 నాటౌట్‌‌)   ఆల్‌‌రౌండ్ పెర్ఫామెన్స్‌‌తో మరోసారి సత్తా చాటిన వేళ విమెన్స్ అండర్‌‌‌‌19  టీ20 వరల్డ్ కప్‌‌లో యంగ్ ఇండియా వరుసగా రెండోసారి విజేతగా నిలిచింది. ఆదివారం ఏకపక్షంగా సాగిన ఫైనల్లో అమ్మాయిలు 9 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించి టైటిల్ నిలబెట్టుకున్నారు. 

టాస్‌‌ నెగ్గి బ్యాటింగ్‌‌కు వచ్చిన సఫారీ టీమ్ తొలుత 20 ఓవర్లలో 82 రన్స్‌‌కే ఆలౌటైంది. మీకె వాన్ వూర్స్ట్ (23) టాప్ స్కోరర్‌‌‌‌. ఆమెతో పాటు జెమ్మా బోథా (16), ఫే కౌలింగ్ (15), కరబో మెసో (10) మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు సాధించారు. త్రిషతో పాటు పరుణిక సిసోడియా (2/6), ఆయుషి శుక్లా (2/9), వైష్ణవి శర్మ (2/23) తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం త్రిష, సానికా చాల్కె (22 బాల్స్‌‌లో 4 ఫోర్లతో 26 నాటౌట్‌‌) మెరుపులతో ఇండియా 11.2 ఓవరల్లోనే 84/1 స్కోరు చేసి ఈజీగా గెలిచింది.

ఇండియా స్పిన్‌‌ మ్యాజిక్‌‌

ఈ టోర్నీలో ఆరంభం నుంచి స్పిన్‌‌తో ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతున్న ఇండియా ఫైనల్లోనూ బంతితో మ్యాజిక్‌‌ చేసింది. రెండో ఓవర్లోనే లెఫ్టార్మ్ స్పిన్నర్ పరుణిక ఓపెనర్‌‌‌‌ సిమోన్ లారెన్స్ (0)ను డకౌట్‌‌ చేసి సౌతాఫ్రికాను తొలి దెబ్బకొట్టింది. ఆ వెంటనే ఆంధ్ర పేసర్ షబ్నిమ్ షకీల్ (1/7) ప్రమాదకమైన జెమ్మా బోథాను ఔట్‌‌ చేసింది. అక్కడి నుంచి స్పిన్నర్లు వరుస వికెట్లతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. అదే స్కోరు వద్ద ఆయుషి.. రామ్లకన్‌‌ (3)ను క్లీన్‌‌బౌల్డ్ చేయడంతో 20/3తో సఫారీలు కష్టాల్లో పడ్డారు. కెప్టెన్‌‌ కైలా రేనెకే (7) వికెట్‌‌ కాపాడుకుంటూ ఇన్నింగ్స్‌‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసింది.  

కానీ, త్రిష బౌలింగ్‌‌కు రావడంతో ఆ జట్టు కష్టాలు మరింత పెరిగాయి. 12వ ఓవర్లో సఫారీ కెప్టెన్‌‌ను త్రిష  పెవిలియన్ చేర్చింది. ఆయుషి వేసిన తర్వాతి ఓవర్లోనే మెసో బౌల్డ్ అవ్వడంతో సౌతాఫ్రికా 44/5తో నిలిచింది. ఈ దశలో వాన్ వూర్ట్స్‌‌, కౌలింగ్ ఆరో వికెట్‌‌కు కీలకమైన 30 రన్స్ జోడించి ఆశలు రేపారు. కానీ, క్రీజులో కుదురుకున్న వాన్ వూర్ట్స్‌‌ను స్టంపౌట్‌‌ చేసిన త్రిష, తర్వాతి బాల్‌‌కే శేష్నీ నాయుడు (0)ను బౌల్డ్ చేసి సఫారీలను కోలుకోలేని దెబ్బకొట్టింది. వాన్‌‌విక్‌‌ (0), లెగోడి (0) కూడా సున్నాలు చుట్టడంతో సౌతాఫ్రికా తక్కువ స్కోరుకే పరిమితం అయింది.

త్రిష ధనాధన్‌‌

సూపర్ ఫామ్‌‌లో ఉన్న త్రిష మరోసారి తన బ్యాట్‌‌ పవర్ చూపెట్టడంతో చిన్న టార్గెట్‌‌ను ఛేజింగ్‌‌ ఇండియాకు నల్లేరు మీద నడకే అయింది.  సెమీస్‌‌లో అదరగొట్టిన మరో ఓపెనర్ కమలిని (8) ఈసారి ఇబ్బంది పడినా.. త్రిష మాత్రం అస్సలు తగ్గలేదు. ఇన్నింగ్స్‌‌ మూడో బాల్‌‌కే బౌండ్రీల ఖాతా తెరిచిన తెలంగాణ అమ్మాయి.. కౌలింగ్‌‌ వేసిన రెండో ఓవర్లో కవర్స్ మీదుగా రెండు ఫోర్లతో అలరించింది. 

శేష్నీ నాయుడు వేసిన నాలుగో ఓవర్లో ముచ్చటైన షాట్లతో మూడు ఫోర్లు కొట్టింది. ఐదో ఓవర్లో కమలినిని ఔట్ చేసిన రేనెకే తొలి వికెట్‌‌కు 36 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్ ను బ్రేక్‌‌ చేసింది. అప్పటికే క్రీజులో కుదురుకున్న త్రిషకు వన్‌‌డౌన్ బ్యాటర్ చాల్కె తోడైంది. ఇద్దరూ ధాటిగా ఆడటంతో టార్గెట్ ఇట్టే కరిగిపోయింది. బోథా వేసిన 11వ ఓవర్లో చాల్కె, త్రిష చెరో ఫోర్‌‌‌‌ రాబట్టారు. ఆపై, లెగోడి బౌలింగ్‌‌లో చాల్కె విన్నింగ్‌‌ ఫోర్ కొట్టడంతో ఇండియా అమ్మాయిల సంబరాలు మొదలయ్యాయి.

వరల్డ్ కప్‌లో త్రిష

రన్స్‌: 309;  వికెట్లు: 7 
హయ్యెస్ట్ స్కోరు: 110* (స్కాట్లాండ్‌పై)
 స్ట్రయిక్ రేట్‌: 147.14
ఫోర్లు: 45, సిక్సర్లు:5
 ఫైనల్లో రన్స్‌: 44 నాటౌట్‌
వికెట్లు: 3

మన నారీ శక్తి పట్ల ఎంతో గర్వపడుతున్నా. వరల్డ్ కప్ గెలిచిన ఇండియా టీమ్‌‌కు అభినందనలు.  ఈ విజయం వారి గొప్ప సమష్టి కృషి, దృఢ సంకల్పం, దైర్యసాహసాల ఫలితం. ఈ గెలుపు ఎంతో మంది యువ అథ్లెట్లకు స్ఫూర్తినిస్తుంది. 
- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

తొలి మ్యాచ్‌‌ నుంచి ఫైనల్‌‌ వరకు మన జట్టు నిజమైన చాంపియన్ల మాదిరిగానే ఆడింది. గెలవడం ప్రత్యేకమైంది. కానీ టైటిల్‌‌ కాపాడుకోవడం అసాధారణమైంది. టీమిండియాకు అభినందనలు. ఈ టీమ్‌‌ చాలా మందికి స్ఫూర్తినిచ్చింది. భవిష్యత్తుకు కొత్త ప్రమాణాలను నిర్దేశించింది. మహిళల క్రికెట్‌‌కు ఇది చాలా సంతోషకరమైంది. 
- సచిన్‌‌ టెండూల్కర్

టీమిండియా అన్‌‌స్టాపబుల్‌‌.   అండర్‌‌–19 వరల్డ్‌‌ కప్‌‌ గెలవడమే కాదు. దానిపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఈ అద్భుతమైన విజయానికి కృషి చేసిన జట్టులోని ప్రతి ఒక్కరికీ, సహాయక సిబ్బందికి అభినందనలు. మేం మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నాం. ఒక స్వర్ణతరం వచ్చింది. 
- మిథాలీ రాజ్‌‌