ఐపీఎల్ ముగిసింది.. వరల్డ్ కప్ అయిపోయింది. మరో 8 నెలల వరకు ఎలాంటి ఐసీసీ ట్రోఫీ లేదు. దీంతో ద్వైపాక్షిక సిరీస్ లు చూడక తప్పదు. ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టు జింబాబ్వేలో పర్యటించనుంది. సీనియర్లకు రెస్ట్ ఇవ్వడంతో ఈ సిరీస్ కు యువ జట్టును ఎంపిక చేశారు. ఐపీఎల్ లో సత్తా చాటిన యంగ్ ప్లేయర్లకు అవకాశం దక్కింది. శనివారం (జూలై 6) నుంచి 5 టీ20 ల సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ కోసం భారత కుర్రాళ్ళు మంగళవారం (జూలై 2) జింబాబ్వే బయలుదేరారు.
జింబాబ్వేకు బయలుదేరిన జట్టు చిత్రాలను BCCI షేర్ చేసింది. ఈ పోస్ట్‌లో అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ తో పాటు కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ ఉన్నారు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రింకు సింగ్, శివమ్ దూబే, ఖలీల్ అహ్మద్ జింబాబ్వే సిరీస్ కు ఎంపికయ్యారు. వీరు ప్రస్తుతం బార్బడోస్ లో ఉన్నాడు. వీరు ఆలస్యంగా జింబాబ్వే చేరుకునే అవకాశముంది.
జూలై 6 నుండి 14 వరకు ఈ సిరీస్ జరగనుంది. మొత్తం ఐదు టీ20లు హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జూలై 6, 7, 10, 13, 14 తేదీల్లో జరగనున్నాయి. 8 ఏళ్ల తర్వాత భారత జట్టు జింబాబ్వేలో పర్యటిస్తోంది. చివరి సారి ఈ ఇరు జట్ల మధ్య 2016లో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగ్గా.. భారత్ 2-0తో గెలిచింది. శుభమాన్ గిల్ ఈ జట్టుకు కెప్టెన్సీ చేస్తాడు. అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, తుషార్ దేశ్‌పాండేలకు తొలిసారిగా భారత సెలెక్టర్ల నుంచి పిలుపొచ్చింది.