కూతురిని ప్రేమిస్తున్నాడని .. బర్త్​ డే రోజే యువకుడిని నరికి చంపిండు

కూతురిని ప్రేమిస్తున్నాడని .. బర్త్​ డే  రోజే యువకుడిని నరికి చంపిండు
  • పెద్దపల్లి జిల్లాలో యువకుడి దారుణ హత్య 
  • యువకుడి పుట్టిన రోజే వెంటాడి చంపిన ప్రియురాలి తండ్రి 

పెద్దపల్లి, సుల్తానాబాద్, వెలుగు: కూతురిని ప్రేమిస్తున్నాడనే కారణంతో ఓ యువకుడిపై దాడి చేసి.. దారుణంగా హత్య చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో  గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. యువకుడు బర్త్​ డే  వేడుకలు జరుపుకుంటుండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. ముప్పిరితోటకు చెందిన పూరెల్ల పరశురాములు, జ్యోత్స్న దంపతుల కొడుకు సాయికుమార్ (20).. పదో తరగతి వరకు చదివి ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఒక యువతితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారింది. ఈ వ్యవహారం ఇరువురి తల్లిదండ్రులకు తెలిసి చిన్న చిన్న గొడవలు జరిగాయి. 

గురువారం సాయికుమార్ తన బర్త్​ డే వేడుకలను స్నేహితులతో కలిసి గ్రామంలోని ఒక స్కూల్ సమీపంలో జరుపుకుంటున్నాడు. అప్పటికే పథకం ప్రకారం యువతి తండ్రి ముత్యం సదయ్య బైక్ పై అక్కడికి చేరుకొని సాయికుమార్ పై గొడ్డలితో దాడి చేశాడు. దీంతో సాయికుమార్ పరుగులు పెట్టాడు. అయినా వెంటాడి నరికి చంపాడు. విషయం తెలుసుకున్న డీసీపీ కరుణాకర్, ఏసీపీ జి.కృష్ణ, సీఐ సుబ్బారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులు పరిశీలించారు. 

మృతదేహాన్ని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డీసీపీ కరుణాకర్ మీడియాతో మాట్లాడుతూ.. ముత్యం సదయ్యతో పాటు మరికొందరు పథకం ప్రకారం సాయికుమార్  హత్యకు పాల్పడ్డారని తెలిపారు. సాయికుమార్ సోదరి ఏడేండ్ల క్రితం విష జ్వరంతో చనిపోయింది. నాడు కూతురు, ఇప్పుడు కుమారుడు మరణించడంతో వారి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనతో ముప్పిరి తోట గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.