మేడ్చల్ లో మంత్రి ఎదుట పేదల ఆందోళన
లాటరీ ద్వారా ఇండ్లు కేటాయించడంపై ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు: డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లాటరీ ద్వారా లబ్ధిదారులకు కేటాయించడం వివాదాస్పదమైంది. తమకు ఇండ్లు రాలేదని స్థానికులు మంత్రి మల్లారెడ్డి ఎదుట ఆందోళనకు దిగారు. పేదలు నిలదీయడంతో మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని చీర్యాల గ్రామంలో ప్రభుత్వం 40 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించింది. మొత్తం 450 మంది దరఖాస్తు చేసుకుంటే, వారిలో 61 మందిని అధికారులు ఎంపిక చేశారు. అయితే 40 ఇండ్లే ఉండడంతో బుధవారం మంత్రి మల్లారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సమక్షంలో లాటరీ తీశారు. దీంతో ఇండ్లు రానోళ్లందరూ ఆందోళనకు దిగారు. లక్కీ డ్రా ద్వారా తమకు అన్యాయం జరిగిందన్నారు. జిల్లాలో పేదల గుర్తింపు ప్రక్రియపై అనుమానాలు ఉన్నాయని, ఇండ్లు దక్కిన వారెవరూ స్థానికులు కాదని ఆరోపించారు. అన్ని అర్హతలు ఉన్నా ఇండ్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులందరికీ ఇండ్లు ఇస్తామన్న సర్కార్.. ఇప్పుడెందుకు ఇట్ల చేస్తోందని ప్రశ్నించారు. ఈ క్రమంలో శ్రీకాంత్ రెడ్డి అనే యువకుడు తన కుటుంబసభ్యులకు ఇల్లు రాలేదనే ఆవేదనతో చీర్యాల గ్రామ పంచాయతీ ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడున్నోళ్లు వెంటనే అప్రమత్తమై ఆ యువకుడిని కాపాడారు. శ్రీకాంత్ రెడ్డిని లోకల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఉచితంగా ఇండ్లు ఇవ్వడం చరిత్రే: మంత్రి
పేదలకు నయా పైసా ఖర్చు లేకుండా ఇండ్లు ఇవ్వడమనేది చరిత్రేనని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఇటీవల కీసర మండలంలోని యాద్గిరిపల్లిలోనూ డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించామన్నారు. చీర్యాలలో లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశామని, అయితే అక్కడ 40 ఇండ్లే ఉండడంతో సమస్య తలెత్తిందన్నారు. పేదలను గుర్తించడంలో, ఇండ్లను కేటాయించడంలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు.
For More News..