- ఊర్లోనే రూ.15 లక్షలుఅప్పు తెచ్చి ఇచ్చిన తండ్రి
- వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఘటన
- యాప్లో 1.50 లక్షలు పోగొట్టుకొని యువతిఆత్మహత్యాయత్నం
వర్దన్నపేట/నర్సింహులపేట(మరిపెడ), వెలుగు: ఆన్లైన్ గేమ్స్ ఓ యువకుడి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. గేమ్స్ కు బానిసై.. లక్షలు పోగొట్టుకొని.. చివరికి చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఏం చేయాలో తోచక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరంగల్ జిల్లా వర్దన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లైశెట్టి భాగ్యలక్ష్మి, కుమారస్వామి దంపతుల కుమారుడు రాజు(25)గత కొన్ని నెలలుగా ఆన్ లైన్ గేమ్స్ కు అలవాటు పడి.. దాదాపు రూ.40 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. కూరగాయలు, పాల వ్యాపారం చేసుకునే రాజు తండ్రి.. కన్న కొడుకును కాదనుకోలేక ఊళ్లోనే దాదాపు రూ.15 లక్షల వరకు అప్పు చేశాడు.
అయినా కొడుకు ఆన్లైన్ గేమ్స్ కు బానిసై.. డబ్బుల కోసం గత కొంత కాలంగా వేధిస్తున్నాడు. రెండు రోజుల ముందు కూడా లక్ష రూపాయలు ఇవ్వగా అవి కూడా పోగొట్టుకున్న రాజు.. తనకు మరో రూ.4 లక్షలు ఇవ్వాలని.. లేదంటే చస్తానని తండ్రినే బెదిరింపులకు గురిచేశాడు. తెలిసిన వారందరి దగ్గరా అప్పులు చేయడంతో మళ్లీ అప్పు పుట్టడం లేదని కొడుకుకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ, శనివారం ఉదయం రాజు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కుమారుడిలా ఎంతో మంది యువకులు ఆన్లైన్ గేమ్లకు బలైపోత్తున్నారని.. ఇలాంటి మోసాలను నుంచి యువతను రక్షించాలని రాజు తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజు సెల్ ఫోన్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
యాప్లో పెట్టిన డబ్బులు పోవడంతో యువతి సూసైడ్ అటెంప్ట్..
మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండలం గ్యామ తండాలో ఓ యువతి సైబర్ ఉచ్చులో పడి డబ్బులు పోగొట్టుకుని సూసైడ్ అటెంప్ట్ చేసింది. తండాకు చెందిన గుగులోతు శైలజ.. ‘ఏక్ కా డబుల్’ అనే యాప్ లో ఒకసారి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబుల్ అవుతాయని మనీ పెట్టడం ప్రారంభించింది. అలా.. 2 వేలతో మొదలై 1.50 లక్షల వరకు పెట్టింది. మొదట్లో డబుల్ ఎమౌంట్ వచ్చినా.. ఆ తరువాత పోయాయి. దీంతో మళ్లీ ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయింది. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లు.. మళ్లీ డబ్బులు ఇన్వెస్ట్ చేయండి.. పోయిన డబ్బులతో పాటు లాభం కూడా వస్తుందని మాయమాటలు చెప్పడంతో ఆశపడిన యువతి డబ్బుల కోసం తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకువచ్చింది. వారు ఎంతకూ డబ్బులు ఇవ్వకపోవడం, ఇప్పటికే 1.50 లక్షల వరకు మోస పోవడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను ఖమ్మంలోని ప్రైవేటు హాస్పిటల్ కు తరలించారు. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.