- నల్గొండ జిల్లా కొప్పోలులో దారుణం
- పోలీసుల అదుపులో నిందితులు!
హాలియా, వెలుగు: తమ బిడ్డను ప్రేమిస్తున్నాడని తండ్రి, నానమ్మ కలిసి కొట్టిన దెబ్బలకు యువకుడు చనిపోయాడు. గురువారం నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కొప్పోలులో ఈ దారుణం జరిగింది. కట్టంగూర్ మండలం దుగినవెల్లికి చెందిన బొడ్డు సంతోష్ (20), నల్గొండలో ఇంటర్ చదువుతున్న బాలిక గతంలో ప్రేమించుకున్నారు. దీనిపై బాలిక తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. పంచాయితీలోనూ తమ పిల్లలు ఒకరి జోలికి మరొకరు వెళ్లకుండా చూసుకోవాలని అంగీకారం కుదిరింది. గురువారం చండూరు మండలం ఉడుతలపల్లిలో రామాలయ వార్షికోత్సవాల సందర్భంగా సంతోష్ తన మేనమామల ఇంటికి వచ్చాడు.
అక్కడి నుంచి మధ్యాహ్నం కొప్పోలులో బాలిక ఇంటికి వెళ్లాడు. ఇంట్లో బాలికతో మాట్లాడుతుండగా ఆమె నానమ్మ చూసి బయట నుంచి గడియపెట్టి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చింది. బాలిక తండ్రి మల్లయ్య, నానమ్మ రాములమ్మ కలిసి తీవ్రంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక సంతోష్ అక్కడికక్కడే చనిపోయాడు. సంతోష్ తల్లిదండ్రులు సైదులు, రేణుక ఉపాధి కోసం సూరత్ వెళ్లారు. సంతోష్ బంధువులు కొప్పోలు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.