- బస్టాండ్ నుంచి అన్నను తీసుకొచ్చేందుకు వెళ్లిన యువకుడు మిస్సింగ్
- కిడ్నాపర్లు తనను చంపుతున్నారని అన్న సెల్ ఫోన్ కు తమ్ముడి మెసేజ్
- తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఖమ్మం రూరల్ పోలీసులు
ఖమ్మం రూరల్, వెలుగు : హైదరాబాద్ నుంచి వస్తున్న అన్న కోసం ఖమ్మం బస్టాండ్‌కు వెళ్లిన యువకుడు మిస్సింగ్ అయ్యాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఖమ్మం రూరల్ మండలం రాజీవ్ గృహకల్పలో ఉండే పందెపు హనుమంతరావుకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు జ్ఞాన సాయి(24) హైదరాబాద్‌లో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. చిన్న కొడుకు సంజయ్ కుమార్(22) అతని వద్దే ఉంటూ సాఫ్ట్ వేర్ కోర్సు నేర్చుకుంటున్నాడు. కాగా సంక్రాంతి సెలవులకు అతడు ముందే వచ్చాడు.
ఆదివారం జ్ఞాన సాయి వస్తుండగా తీసుకొచ్చేందుకు అర్ధరాత్రి సంజయ్బైక్ పై వెళ్లి మిస్సింగ్ అయ్యాడు. “ నేను కరుణగిరి వద్ద రాజీవ్ గృహకల్ప కాలనీకి వెళ్లే దారిలో చికెన్ షాపు వద్ద గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు కలిసి మహిళను ఆటోలో కిడ్నాప్ చేస్తుండగా చూసి వెంబడించాను. గురుదత్త ఫౌండేషన్ దాకా ఫాలో అయ్యానని.. అక్కడ వారు చూసి నన్ను కూడా కిడ్నాప్ చేశారని.. చంపుతున్నారు’’.. అని జ్ఞానసాయికి మెసేజ్ చేశాడు. వెంటనే కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారు కాల్వ కట్టవైపు వెళ్లగా కనిపించలేదు. బైక్ కనిపించిందని, సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ ఉందని, తమ కొడుకును కిడ్నాప్ చేశారా.? లేదా చంపివేశారా? తెలియడం లేదని తండ్రి హనుమంతరావు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రూరల్ సీఐ రాజు తెలిపారు.