మేడ్చల్ జిల్లా రావల్‌కోల్‌లో దారుణం
క్రికెట్ బెట్టింగ్‌కు బానిసై అప్పులు చేసిన కొడుకు
ట్రీట్‌మెంట్ పొందుతూ ఇద్దరూ మృతి
కొడుకును అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్, వెలుగు: మేడ్చల్ జిల్లా రావల్ కోల్ లో తల్లికూతుళ్ల అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ఈ నెల 23న అస్వస్థతకు గురై హాస్పిటల్ లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న తల్లికూతుళ్లు రెండ్రోజుల క్రితం మృతి చెందారు. ఇద్దరి మృతికి కొడుకే కారణమనే కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మేడ్చల్ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్స్ కు బానిసై అప్పులు తీర్చేందుకు తల్లి, చెల్లిని విషం పెట్టి చంపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. చనిపోయిన తండ్రి ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వాలని గొడవపడేవాడని, డబ్బులు ఇవ్వకపోవడంతో ఇద్దరినీ చంపాలని ప్లాన్ చేసినట్టు తెలిసింది. విషం కలిపిన భోజనం తినడం వల్లనే ఈ నెల 26,27న తల్లీకూతుళ్లు చనిపోయినట్టు అనుమానిస్తున్నారు. మేడ్చల్ జిల్లా రావల్‌కోల్‌లో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన మేడ్చల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
రూ.20 లక్షల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం..
రావల్‌కోల్‌కు చెందిన ప్రభాకర్ రెడ్డి, సునీతరెడ్డి దంపతులకు కొడుకు సాయిరెడ్డి, కూతురు అనూష ఉన్నారు. కూతురు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. చెడు వ్యసనాలకు బానిసైన సాయిరెడ్డి చదువు మానేశాడు. ప్రభాకర్ రెడ్డి రెండేండ్ల క్రితం ప్రమాదంలో చనిపోవడంతో సునీతరెడ్డికి రూ.20 లక్షలు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యింది. సాయిరెడ్డి క్రికెట్ బెట్టింగ్‌కు బానిసై, ఐపీఎల్‌లో బెట్టింగ్స్ పెట్టి అప్పులపాలయ్యాడు. అప్పులు తీర్చేందుకు ఇన్సూరెన్స్ డబ్బివ్వాలని తల్లి, చెల్లితో గొడవ పడేవాడని తెలిసింది.
చెల్లి 26న, తల్లి 27న మృతి
తల్లి సునీత, చెల్లి అనూషను చంపేందుకు ప్లాన్ వేసిన సాయి.. ఈ నెల 23న రాత్రి భోజనంలో విషం కలిపాడని బంధువులు ఆరోపించారు. ఆ అన్నం తిన్న ఇద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లారని చెప్పారు. తల్లీకూతుళ్లను స్థానికులు మేడ్చల్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించామన్నారు. ట్రీట్‌మెంట్ పొందుతూ ఈ నెల 26న అనూష, 27న సునీత చనిపోయారు. బంధువులు, ఇచ్చిన సమాచారంతో మేడ్చల్ పోలీసులు సాయిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలను ప్రెస్‌మీట్‌లో వెల్లడించనున్నారు.
For More News..