ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో యువకుడి మిస్సింగ్ కలకలం రేపుతోంది. బర్రెలు కాచేటందుకు అడవిలోకి వెళ్లిన యువకుడు బర్రెలతో సహా తప్పిపోయాడు. ఎంత వెతికినా దొరకడం లేదు. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
ఇందిరిశ్వరం గ్రామానికి చెందిన తరుణ్ అనే 22 సంవత్సరాల యువకుడు మే 15న బర్రెలు కాసేందుకు నల్లమల అడవి ప్రాంతంలోకి వెళ్లి అదృశ్యమయ్యాడు. 24 గంటలు గడుస్తున్నా తరుణ్ ఇంటికి రాకపోవడంతో అతడి బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న ఆత్మకూరు పోలీసులు అడివిలో గాలిస్తున్నారు. డ్రోన్ సహాయంతో తరుణ్ జాడ ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఆత్మకూరు సిఐ లక్ష్మీనారాయణ తెలిపారు.