- కొంపల్లిలో ఘటన
- మాదాపూర్లో ఆర్థిక ఇబ్బందులతో మరొకరు..
జీడిమెట్ల, వెలుగు: చనిపోయిన తాత రమ్మంటున్నాడంటూ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొంపల్లికి చెందిన సిరిగాధ రమేశ్కొడుకు మనోహర్ (27) ఉద్యోగం లేక ఇంటి వద్దనే ఉంటున్నాడు. మూడు నెలల కిందట మనోహర్ తాత అనారోగ్యంతో మృతి చెందాడు.
అప్పటి నుంచి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తరచూ నిద్రలో తాత రమ్మంటున్నాడని కలవరించేవాడని తల్లిదండ్రులు తెలిపారు. ఇదే క్రమంలో మంగళవారం రాత్రి భోజనం చేసిన తరువాత బెడ్రూమ్లోకి వెళ్లి ఉరేసుకొని మృతి చెందాడు.
బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. యువకుడి జేబులో సూసైడ్నోట్ను గుర్తించారు. అందులో “సారీ మమ్మీ డాడీ.. నాకు తాత గుర్తుకొస్తున్నాడు.. రమ్మంటున్నాడు.. అందుకే వెళ్లిపోతున్నా”అంటూ రాశాడు. ఈ మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మాదాపూర్: ఆర్ధిక ఇబ్బందులతో ఓ యువకుడు హోటల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మాదాపూర్ గుట్టల బేగంపేటకు చెందిన నిమ్మ వంశీకృష్ణరెడ్డి (25) బీటెక్ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడు. ఈ నెల 7న ఉదయం బయటకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు.
ఆ తర్వాత ఇంటికి సమీపంలో ఉన్న అరుణోదయ కాలనీలోని ఓ హోటల్ లో రూమ్ తీసుకొన్నాడు. బుధవారం ఉదయమైనా అతడు బయటకు రాకపోవడంతో హోటల్ సిబ్బంది వెళ్లి చూడగా, ఉరేసుకొని కనిపించాడు.
సంఘటనా స్థలానికి చేరుకున్న మాదాపూర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, యువకుడు ఉద్యోగం లేక అప్పులు చేసి ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నట్లు సమాచారం.