సూర్యాపేట, వెలుగు : చెరువులో దూకిన మహిళను ఓ యువకుడు తన ప్రాణాలకు తెగించి కాపాడాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..విజయవాడకు చెందిన హారిక..కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుందామని అనుకుంది. ఆదివారం ఇంట్లో ఎవరికి చెప్పకుండా విజయవాడ నుంచి హైదరాబాద్కు బస్సులో బయలుదేరింది. సూర్యాపేటలో బస్సు ఆగగా దిగింది. మధ్యాహ్నం రెండు, మూడు గంటల ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్లి బస్టాండ్ పక్కనే ఉన్న సద్దాల చెరువు మినీ ట్యాంక్ బండ్ లో దూకింది.
అక్కడే ఉన్న కొంతమంది గమనించి కేకలు వేశారు. అదే సమయంలో అటు వైపు వెళ్తున్న జమ్మిగడ్డకు చెందిన గుండారపు నవీన్ చెరువులో దూకి ఆమెను బయటకు తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి హారిక కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.