
నిర్మల్, వెలుగు: దుబాయిలో కురిసిన భారీ వర్షం, పోటెత్తిన వరదల్లో చిక్కుకున్న పలువురు బాధితులను నిర్మల్ కు చెందిన సందీప్ అనే యువకుడు రక్షించి ప్రశంసలందుకుంటున్నాడు. స్థానిక బంగల్ పేట్ వీధికి చెందిన పాతర్ల సందీప్ నాలుగేండ్ల నుంచి దుబాయ్‌లోని గ్రీన్ కమ్యూనిటీ విల్లాస్‌లో ఉన్న స్విమ్మింగ్ పూల్స్‌లో లైఫ్ గార్డ్ గా పనిచేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం దుబాయిలో వరదల కారణంగా వందలాదిమంది ఇండ్లలోనే చిక్కుకుపోయారు. వీరందరినీ బయటికి తీసుకురావడం అక్కడి పోలీస్ యంత్రాంగానికి కష్టతరమైంది.
దీంతో స్విమ్మింగ్ పూల్స్‌లో, ఇతర చోట్ల పనిచేస్తున్న లైఫ్ గార్డులందరినీ అక్కడి ప్రభుత్వం సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా కోరింది. దీంతో పాతర్ల సందీప్ మరో లైఫ్ గార్డ్‌తో కలిసి తనకు కేటాయించిన ప్రాంతంలో ఇండ్లల్లో చిక్కుకున్న వారందరిని సురక్షితంగా బయటికి తీసుకువచ్చాడు. ఇప్పటికీ వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలోనే నిమగ్నమయ్యాడు. సందీప్ చేస్తున్న సహాయక చర్యలను అక్కడి సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. ప్రభుత్వ అధికారులు సైతం ప్రశంసిస్తూ సందీప్‌ను అభినందించారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్ స్టాగ్రాంమ్వేదికల ద్వారా సందీప్‌ను ప్రశంసిస్తున్నారు.