ముందొచ్చినా.. వెనక వ్యక్తికి పెట్రోల్ పోశాడని.. బంక్ కి నిప్పంటించిన యువకుడు

ముందొచ్చినా.. వెనక వ్యక్తికి పెట్రోల్ పోశాడని.. బంక్ కి నిప్పంటించిన యువకుడు
  • మల్లాపూర్​లో ఘటన ఇద్దరి అరెస్ట్

నాచారం, వెలుగు: తన కంటే వెనక వచ్చిన వ్యక్తికి పెట్రోల్ పోశాడన్న కోపంలో ఓ యువకుడు బంక్‌కు నిప్పింటించాడు. ఈ కేసులో యువకుడిని, బంక్ క్యాషియర్ ను   నాచారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మీర్​పేటకు చెందిన చందన్​కుమార్​(19) మరో ఇద్దరు ఫ్రెండ్స్​తో కలిసి శనివారం రాత్రి మల్లాపూర్ లోని హెచ్​పీ పెట్రోల్ బంకుకు వెళ్లాడు. 

తన బైక్ లో రూ.50 పెట్రోల్ పోయాలని బంక్​ క్యాషియర్​అరుణ్​కుమార్​(33)ను అడిగాడు. అతడు అప్పటికే మరో వ్యక్తికి పెట్రోల్ పోస్తుండడంతో.. తనకంటే వెనక వచ్చిన వ్యక్తికి బాటిల్​లో పెట్రోల్ ఎందుకు పోస్తున్నావని నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. తన బైక్ లో ముందుగా పెట్రోల్​  పోయాలని, లేదంటే బంకుకు నిప్పు పెడతానని బెదిరించాడు. ‘బంక్​కు నిప్పు ఎలా పెడతావో పెట్టి చూడు నీ సంగతి చూస్తా’నంటూ బంక్​క్యాషియర్ రెచ్చగొట్టాడు.

దీంతో  ఆగ్రహానికి గురైన చందన్​కుమార్ అగ్గిపుల్ల గీసి పెట్రోల్ గన్ పై వేశాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ మంటలు చెలరేగాయి. దీంతో అక్కడున్న వారంతా పరుగులు తీశారు. వెంటనే బంక్​లోని సిబ్బంది అప్రమత్తమై ఫైర్ ను ఆపే గ్యాస్ తో మంటలు ఆర్పివేశారు. ఈ ఘటనలో నిప్పు పెట్టిన యువకుడిని, బంక్ క్యాషియర్ ను నాచారం పోలీసులు అరెస్టు చేశారు.