హాలియా, వెలుగు: గంజాయి మత్తులో ఓ వ్యక్తి స్నేహితుడిని బ్లేడుతో గొంతు కోసి పారిపోయాడు. నాగార్జున సాగర్ ఎస్సై సంపత్ కథనం ప్రకారం..నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్ కాలనీకి చెందిన పుట్టపాక విష్ణువర్ధన్, నల్లగంతుల నితిన్ చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. విష్ణువర్ధన్ స్థానిక బుద్దవనంలో సూపర్వైజర్.
శనివారం సాయంత్రం5 గంటలకు నితిన్... విష్ణువర్ధన్ కు ఫోన్ చేసి సాగర్లోని ఓ ప్రాంతానికి రమ్మని పిలిచాడు. దీంతో విష్ణువర్ధన్ అక్కడికి వెళ్లేసరికి నితిన్మందు తాగుతున్నాడు. కొద్దిసేపటికే తన గురించి చెడుగా ప్రచారం చేస్తున్నావంటూ నితిన్...విష్ణువర్ధన్తో గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో నితిన్ బ్లేడుతో విష్ణువర్ధన్ మెడ కోసి పరారయ్యాడు. విష్ణును స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.