అప్పు పైసలు అడిగాడని.. సర్జికల్ బ్లేడుతో గొంతుకోసి హత్య

అప్పు పైసలు అడిగాడని.. సర్జికల్ బ్లేడుతో గొంతుకోసి హత్య

ఎల్బీనగర్, వెలుగు: అప్పు పైసలు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు ఓ యువకుడు సర్జికల్​బ్లేడుతో గొంతు కోసి చంపేశాడు. ఈ ఘటన మంగళవారం హయత్ నగర్ లో చోటుచేసుకుంది. ఇన్​స్పెక్టర్ నాగరాజు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని దొనకొండకు చెందిన యక్కలి కాశీరావు(37) 20 ఏండ్లుగా కుటుంబ సభ్యులతో కలిసి వనస్థలిపురంలోని అరుణోదయనగర్ కాలనీలో ఉంటున్నాడు. కార్లు కొనడం, అమ్మడంతోపాటు అప్పులు ఇస్తుంటాడు. నాలుగేళ్ల కింద ఇతనికి నల్గొండ జిల్లా గట్టుప్పల్ కు చెందిన పెద్దగొని శేఖర్(24)తో పరిచయం ఏర్పడింది. 

2023లో శేఖర్​రెండు విడతలుగా కాశీరావు దగ్గర రూ.5.10 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. తిరిగి చెల్లించకపోవడంతో కొన్నాళ్ల కింద ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తర్వాత శేఖర్ తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు. కాశీరావు అతన్ని తిరిగి సిటీకి తీసుకొచ్చి తన ఇంటి ఫస్ట్​ఫ్లోర్​లో అద్దెకు ఉంటున్న బ్యాచిలర్స్​ సాయి, ఐతరాజు శంకర్ తో ఉంచాడు. సాయి, శంకర్ బొమ్మల గుడి దగ్గర ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతుండగా శేఖర్ కాశీరావుతో కలిసి కార్ల బిజినెస్​చేస్తున్నాడు. ఈ క్రమంలో కాశీరావు శేఖర్​వద్ద కొంత అప్పు పైసలు రాబట్టాడు. మంగళవారం ఉదయం 9 గంటలకు కాశీరావు ఫస్ట్​ఫ్లోర్​కు వెళ్లాడు. 

మొత్తం అప్పు చెల్లించాలని డిమాండ్​చేయడంతో మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. శేఖర్ అప్పటికే రూంలో తెచ్చి పెట్టుకున్న సర్జికల్ బ్లేడ్ తో కాశీరావు గొంతు కోసి చంపేశాడు. 10.20 గంటలకు బట్టలు ఆరేస్తున్న కాశీరావు భార్య సుమలతతో ‘నీ భర్తను చంపి పడేశాను’ అని చెప్పి హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. సుమలత హుటాహుటిన పైకి వెళ్లి చూడగా కాశీరావు అప్పటికే చనిపోయి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఇది ఇలా ఉండగా శేఖర్ బెట్టింగ్, చెడు వ్యసనాలకు అలవాటు పడి అప్పులు చేసినట్లు తెలిసింది.