సియోల్ నుంచి 'వెలుగు' ప్రతినిధి : రాష్ట్రంలో ఫ్యాషన్ టెక్నాలజీ వర్సిటీ ఏర్పాటుకు సౌత్ కొరియా కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన యంగ్ వన్ కార్పొరేషన్ సానుకూలత వ్యక్తం చేసింది. ఫోర్త్ సిటీలో 20 ఎకరాలు కేటాయిస్తే ఫ్యాషన్ టెక్నాలజీ వర్సిటీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమని పేర్కొంది. సియోల్ పర్యటనలో ఉన్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం మంగళవారం సియోల్ లోని యంగ్ వన్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి, కంపెనీ చైర్మన్ కిహాక్ చుంగ్ తో సమావేశమైంది. ఈ సందర్భంగా ఫ్యాషన్ టెక్నాలజీ వర్సిటీ గురించి ఆ సంస్థ చైర్మన్ కిహాక్ ఆసక్తి చూపించారు. టెక్స్ టైల్ రంగంలో వస్తున్న అంతర్జాతీయ మార్పులకు అనుగుణంగా ఈ యూనివర్సిటీ ఉంటుందని, దీంతో హైదరాబాద్ కేం ద్రంగా భారత వస్త్ర పరిశ్రమ గణనీయ వృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. సానుకూలంగా స్పందించిన మంత్రులు ఫోర్త్ సిటీలో 20 ఎకరాలు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే ఫోర్త్ సిటీ భూ వినియోగంపై త్వరలో కొత్త ల్యాండ్ పాలసీని ప్రకటించనున్నామని, నూతన విధానానికి అనుగుణంగానే భూ కేటాయింపు ఉంటుందన్నారు.
మార్చిలోపు కేఎంటీపీలో మరో 4 యూనిట్లు..
టెక్స్ టైల్ రంగంలో ప్రపంచంలోనే దిగ్గజ వస్త్ర తయారీ కంపెనీగా యంగ్ వన్ కు పేరుంది. వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ (కేఎంటీపీ)లో ఈ సంస్థకు ఇప్పటికే ప్రభుత్వం 298 ఎకరాలు కేటాయించగా.. ఇందులో ఒక యూనిట్ ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించింది. ఇక్కడ తయారవుతోన్న ట్రెక్కింగ్ స్పోర్ట్ వేర్ టీషర్టులు ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయి. రూ.840 కోట్లతో మొత్తం11 యూనిట్లు ఏర్పాటుచేస్తామని కంపెనీ గతంలో ప్రకటించింది. మిగతా యూనిట్ల ప్రారంభం గురించి కూడా సమావేశంలో మంత్రులు ప్రస్తావించారు.
వచ్చే ఏడాది మార్చిలోపు మరో నాలుగు యూనిట్లు ఏర్పాటు చేస్తామని కిహాక్ చుంగ్ అన్నారు. మిగతా యూనిట్లను ఆ తర్వాత ప్రారంభిస్తామన్నారు. వరంగల్ కేంద్రంగా కేఎంటీపీ నుంచి ఉత్పత్తి అవుతున్న తమ వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయని, భవిష్యత్తులో మరిన్ని యూనిట్లు వస్తే వ్యాపారం మరింత పెరుగుతుందని తెలిపారు. వరంగల్ ఎయిర్ పోర్టు అందుబాటులోకి వస్తే తమకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని, జిల్లా పారిశ్రామికంగా మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు.
దీనికి స్పందించిన మంత్రులు.. మామునూరు ఎయిర్ స్ట్రిప్ పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు. ఏడాదిన్నరలో మామునూరు ఎయిర్ స్ట్రిప్ ను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. అయితే, యంగ్ వన్ కార్పొరేషన్ చైర్మన్ గా తన కూతురు త్వరలోనే బాధ్యతలు స్వీకరించనుందని, వచ్చే ఏడాది ప్రారంభంలో కేఎంటీపీ కొత్త యూనిట్ల ప్రారంభానికి ఆమె వస్తారని మంత్రులకు కిహాక్ చుంగ్ తెలిపారు. సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ పాల్గొన్నారు.