తలా కొంత వేసుకొని.. గుంతల రోడ్డును రిపేర్​ చేసుకున్నరు

రాజన్నసిరిసిల్ల, వెలుగు: రోడ్డు గుంతలుగా మారగా.. దాన్ని బాగు చేసుకునేందుకు యువత ముందుకొచ్చారు. రోడ్డు బాగుచేసుకుందామని గ్రామ వాట్సాప్ ​గ్రూపులో పిలుపునిచ్చారు. తలా కొంత వేసుకొని వారే రోడ్డు రిపేర్ ​చేసుకున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్​మండలం బొల్లారం గ్రామంలో 850 మంది జనాభా ఉంది. చిన్న గ్రామం కావడంతో ప్రతీ అవసరానికి, 
విద్యార్థులు పైచదువులకు పక్కనున్న  హన్మాజీపేటకు వెళ్లాల్సి ఉంటుంది.

ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు పాడైంది.  ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. విద్యార్థులు, గ్రామస్తుల ఇబ్బందులు చూసి గ్రామ యువత కొందరు రోడ్డు బాగుచేసుకుందామని వాట్సాప్‌లో పిలుపునివ్వడంతో స్థానికులతోపాటు ఇతర ప్రాంతాల్లో పనిచేసే ఆ ఊరి యువత స్పందించారు. తలా కొంత వేసుకొని రూ.50వేలు కలెక్ట్​ చేశారు. ట్రాక్టర్లతో మట్టి తీసుకొచ్చి గుంతల్లో పోసి చదును చేశారు. రోడ్డు కోసం ఎమ్మెల్యే రమేశ్‌బాబును పలుమార్లు కలిశామని, అయినా స్పందించలేదని సర్పంచ్​ సుద్దాల లచ్చయ్య చెప్పారు.