ఫోటోషూట్ కోసం ఫోటోగ్రాఫర్ ని పిలిచి చంపేసి 10లక్షల విలువ చేసే కెమెరాను దొంగలించిన ఘటన వైజాగ్ లో చోటు చేసుకుంది. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు ఫోటోలు తీసి జీవనం సాగిస్తున్న 23ఏళ్ళ సాయి పవన్ కళ్యాణ్ అనే యువకుడిని ఫోటో షూట్ కి రమ్మని పిలిచాడు షణ్ముఖ్ అనే వ్యక్తి. వైజాగ్ నుండి రాజమండ్రికి చేరుకున్న పవన్ కళ్యాణ్ ను తన స్నేహితులతో కలిసి రిసీవ్ చేసుకొని ముందుగా ప్లాన్ చేసినట్టుగా మర్డర్ చేసి కెమెరా సహా ఇతర సామాగ్రిని దోచుకున్నారు.
ఫిబ్రవరి 29న పవన్ కళ్యాణ్ కనిపించట్లేదంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ తల్లిదండ్రులు. కంప్లైంట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, కోనసీమ జిల్లా మూలస్థానం వద్ద పవన్ కళ్యాణ్ మృతదేహాన్ని గుర్తించారు. ఫిబ్రవరి 26న ఈ హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మొదటి ముద్దాయి షణ్ముఖ్, అతని స్నేహితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కెమెరా కోసమే ఈ హత్య చేశారని నిర్దారించారు.
కాల్ డేటా ఆధారంగా ఈ కేసును ఛేదించామని, పవన్ కళ్యాణ్ వద్ద ఉన్న 10లక్షల విలువ చేసే కెమెరా కోసం తన స్నేహితులతో కలిసి ఈ హత్యకు పాల్పడ్డట్టు షణ్ముఖ్ ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. డబ్బు కోసం నేటి యువత ఎంతకైనా దిగజారుతుందని ఈ సంఘటన మరోసారి నిరూపించింది. డబ్బు యావలో యువత పక్కదారి పట్టాలకుండా, ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ఉండేలా తల్లితండ్రుల నుండి పోలీసుల వరకు అందరు బాధ్యత వహించాలి.