
సింగపూర్: సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇండియాకు మిశ్రమ ఫలితాలు లభించాయి. యంగ్ షట్లర్లు ట్రీసా జోలీ–గాయత్రి గోపీచంద్ సంచలన విజయంతో క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్తే.. స్టార్ ప్లేయర్ పీవీ సింధు పోరాడి ఓడింది. గురువారం జరిగిన విమెన్స్ డబుల్స్‌లో ట్రీసా–గాయత్రి 21–9, 14–21, 21–15తో వరల్డ్ రెండో ర్యాంకర్లు బీక్ హా నా–లీ సో హీ (సౌత్ కొరియా)కు షాకిచ్చారు. దీంతో బీక్ హ– లీ సోహితో తలపడిన మూడుసార్లలో తొలి విజయాన్ని అందుకున్నారు.
విమెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సింధు 21–13, 11–21, 20–22తో మూడోసీడ్ కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో కంగుతిన్నది. 2018 నుంచి మారిన్ చేతిలో సింధు ఓడటం ఇది వరుసగా ఆరోసారి. గంటా 8 నిమిషాల మ్యాచ్‌లో తొలి గేమ్‌లో సూపర్‌గా ఆడిన తెలుగమ్మాయి రెండో గేమ్‌లో మారిన్ షాట్లకు బదులివ్వలేకపోయింది. అయితే డిసైడర్‌లో సింధు వరుసగా 11–9, 14–10, 18–15తో లీడ్‌లో నిలిచింది.
కానీ వెంటనే తేరుకున్న మారిన్ డ్రాప్ షాట్స్‌తో 19–20 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో మారిన్ బలమైన క్రాస్ కోర్టు విన్నర్స్‌తో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. మెన్స్ సింగిల్స్‌లో హెచ్.ఎస్. ప్రణయ్ 13–21, 21–14, 15–21తో కెంటా నిషిమోటో (జపాన్) చేతిలో ఓడాడు.