జైలు నుంచి వచ్చిన ప్రియుడు.. పెళ్లికి నో చెప్పడంతో బావిలో దూకేసింది

వరంగల్ రూరల్ జిల్లా: జైలు కెళ్లిన ప్రియుడు ఇంటికి తిరిగొచ్చాడని వెళ్లిన యువతి నిరాశకు గురై.. తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసింది. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో మంగళవారం జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నర్సంపేటలోని స్నేహా నగర్‌కు చెందిన వాంకడొతు లక్ష్మీ ప్రసన్న ప్రియుడి ఇంటి ఆవరణలో ఉన్న చేదుడు బావిలోకి దూకడంతో పోలీసులు వెంటనే తరలివచ్చారు. అయితే బావిలో నీళ్లు ఎక్కువ లోతు లేకపోవడంతో తీవ్రంగా గాయపడింది. ప్రాణాలు పోలేదని గుర్తించిన పోలీసులు వేగంగా తాళ్ల సహాయంతో బావిలోకి దిగి.. గాయపడిన యువతి లక్ష్మి ప్రసన్నను పైకి తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. పండుగ నాడు జరిగిన ఈ ఘటనను చూసేందుకు భారీగా జనం తరలిరావడం సంచలనం సృష్టించింది. వివరాలిలా ఉన్నాయి. స్నేహనగర్ కు చెందిన లక్ష్మిప్రసన్న తో అజ్జు అనే వివాహితుడు  పెళ్లి చేసుకుంటానని చనువుగా తిరిగాడు. పెళ్లి చేసుకోమని అడగ్గా.. చేసుకోలేనని చెప్పడంతో తనతో తిరిగి మోసం చేశాడని లక్ష్మ్రి ప్రసన్న ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది. కేసులో ఇటీవలే జైలు నుంచి అజ్జూ బయటకు వచ్చాడని తెలుసుకున్న లక్ష్మిప్రసన్న మంగళవారం నాడు ఎన్టీఆర్ నగర్ లో ఉన్న అజ్జు ఇంటికి వెళ్లింది. ఇప్పటికైనా తనను పెళ్లి చేసుకోవాలని అడుగగా అజ్జూ  నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. చావు తప్ప మరో మార్గం లేదంటూ ప్రియుడి ఇంటి ఆవరణలోని బావిలో దూకేసింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్.ఐ నవీన్ వెంటనే స్పందించారు.లక్ష్మీ ప్రసన్నను కాపాడేందుకు ఓ వైపు బావిలోకి దిగి తాళ్లతో రక్షించే యత్నం చేస్తూనే మరో వైపు ఘటనా స్థలానికి అంబులెన్స్ ను రప్పించారు. ఆత్మహత్యాయత్నం చేసిన లక్ష్మిప్రసన్నను లోతుగా ఉన్న బావిలో నుంచి బయటకు తీసుకొచ్చి రక్షించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఒడ్డుకు తీసుకొచ్చిన వెంటనే ప్రాథమిక చికిత్స చేస్తూ.. అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు.