
జగిత్యాల: గ్రూప్స్ పరీక్షల్లో క్వాలిఫై కాలేదని మనస్థాపంతో యువతి సూసైడ్ చేసుకుంది. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కథలాపూర్ మండల కేంద్రానికి చెందిన ఆకుల శృతి అనే యువతి గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యింది. హైదరాబాద్లో ఉండి చదివింది. అయితే.. ఇటీవల విడుదలైన గ్రూప్స్ పరీక్షల్లో శృతి ఉత్తీర్ణత సాధించలేదు. మరోవైపు ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగోలేవు. ఓ వైపు ఆర్థిక సమస్యలు.. మరోవైపు కష్టపడి చదివినప్పటికీ గ్రూప్స్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో మనస్థాపానికి గురైంది.
ఈ క్రమంలోనే సోమవారం (మార్చి 31) ఇంట్లో ఎవరు లేని సమయంలో దూలానికి చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి ఇంటికి వచ్చి చూసే వరకు శృతి మృతి చెందింది. మృతురాలి తల్లి రోజా ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. శృతి మరణంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పెళ్లి ఊడుకు వచ్చిన కూతురు మరణించడంతో శృతి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరు అయ్యారు