పెళ్లి ఇష్టం లేక.. చదువుపై ప్రేమతో.. అశోక్ నగర్‎లో అభ్యర్థిని ఆత్మహత్య

పెళ్లి ఇష్టం లేక.. చదువుపై ప్రేమతో.. అశోక్ నగర్‎లో అభ్యర్థిని ఆత్మహత్య

హైదరాబాద్: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్‎లో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతి చున్నీతో ఫ్యాన్‎కు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా సోమారం గ్రామానికి చెందిన రేణుక (24) అశోక్ నగర్‎లో ఉంటోంది. ఓ ప్రైవేటు హాస్టల్‎లో ఉంటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ఈ క్రమంలో రేణుకకు వివాహం చేయాలని కుటుంబ సభ్యులు నిశ్చయించుకున్నారు. నవంబర్‎లో ఓ యువకుడితో ఎంగేజ్మెంట్ జరిగింది. 2025, ఫిబ్రవరి 7వ తేదీన రేణుక మ్యారేజ్ ఫిక్స్ అయింది.

పెళ్లి వరకు హైదరాబాద్‎లో చదువుకుంటానని అశోక్ నగర్ వచ్చిన రేణుక పెళ్లి నచ్చకపోవడంతో తీవ్ర మనస్థాపం చెంది 2024, డిసెంబర్ 24న ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్‎లో ఫ్యాన్‎కు చున్నీతో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. పక్కరూమ్‎లో ఉన్న స్నేహితురాలు గమనించి హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించింది. కొన ఊపిరితో ఉన్న రేణుకను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రేణుక మృతి చెందింది. మరో నెలన్నర రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన కూతురు విగతజీవిగా మారడంతో రేణుక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.