మోడల్ అవ్వాలన్నది ఆమె కల. అయితే ఆడిషన్స్‌కి వెళ్లిన ప్రతిసారి ‘రంగు తక్కువ ఉన్నావని... గ్లామర్ ఫీల్డ్‌లో నువ్వు ఫిట్ కావని’ రిజెక్ట్ చేశారు. ఆమెని ఎవ్వరూ నమ్మలేదు. కానీ, ఎప్పటికైనా తను మోడల్ అవుతానని ఆమె గట్టిగా నమ్మింది. వెయిట్రస్‌గా పనిచేస్తూ తన డ్రీమ్ నెరవేర్చుకుంది. అనుకున్నట్టుగానే మోడల్‌గా ర్యాంప్‌పై నడిచింది రెనీ కుజుర్.
తన ఒంటి రంగు, లుక్ గురించి చిన్నతనంలోనే అవమానాలకి గురైంది రెనీ. మూడేళ్లప్పుడు స్కూల్ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసేందుకు రెడీ అయ్యి వెళ్లింది. చిన్నపిల్ల భయం లేకుండా స్టేజీ మీదకు వచ్చినందుకు ఎంకరేజ్ చేస్తారు. కానీ, అక్కడున్న కొందరు ‘చూడండి చూడండి... నల్ల అమ్మాయి వచ్చింది’ అంటూ కొందరు కామెంట్లు చేశారు. అలాంటి మాటల ప్రభావం పిల్లల మనసుపై తెలియకుండానే పడుతుంది. కానీ, రెనీ మాత్రం ఆ మాటలపై గెలిచింది.
సబ్వేలో వెయిట్రస్‌గా
రెనీది ఛత్తీస్‌గఢ్‌లోని పిరాయ్ అనే పల్లెటూరు. మోడల్ అవ్వాలన్న రెనీ కలకి పేదరికం అడ్డుపడింది. రెనీ వాళ్ల అమ్మ ఫెలిసిట ఇళ్లల్లో పనులు చేసేది. వాళ్ల నాన్న ఫిలిదియస్ కుజుర్ గవర్నమెంట్ ఆఫీసులో చిరుద్యోగి. ఎలాగోలా నెట్టుకొస్తున్న వాళ్ల జీవితాలకి పెద్ద షాక్! వాళ్లనాన్నకి క్యాన్సర్. ఆర్ఠిక ఇబ్బందుల వల్ల రెనీ చదువు ఆపేసింది. చర్చి వాళ్లు ఇచ్చిన డ్రెస్‌లు వేసుకునేది. కొన్నిసార్లు రోజుకు ఒక్కపూట మాత్రమే తినేది. ఎవరి దగ్గర చేయి చాచకుండా బతకాలని అనుకుని సబ్వేలో వెయిట్రస్‌గా చేరింది. ఆ తర్వాత మెక్‌డొనాల్డ్స్, బరిస్తా వంటి రెస్టారెంట్లలో కూడా పనిచేసింది. జాబ్ చేస్తూ వచ్చిన డబ్బులో కొంత తన కల నెరవేర్చుకునేందుకు దాచుకునేది.
టీవీలో చూసి..
కొన్నాళ్లకి ‘అజా ఫ్యాషన్’కి అనుబంధంగా ఉన్న టామీ హిల్ఫిగర్ అనే బట్టల షాప్‌లో సేల్స్ గర్ల్‌గా చేరింది రెనీ. ఫ్యాషన్ డిజైనర్లు, కొత్త కొత్త డిజైన్స్‌తో డ్రెస్ల్ని డిజైన్ చేసేవాళ్లు. అవి చూసి మోడలింగ్ వైపు అడుగులు వేసింది. దాచుకున్న డబ్బుని మోడలింగ్‌లో ట్రెయిన్ అయ్యేందుకు ఖర్చు పెట్టింది. టీవీలో మోడల్స్‌ని చూసి కాన్ఫిడెంట్‌గా ర్యాంప్ వాక్ చేయడం నేర్చుకుంది. కానీ, రంగు తక్కువ ఉందని కొన్ని మోడలింగ్ కంపెనీలు ఆమె ఫొటోల్ని రిజెక్ట్ చేశాయి. లాక్మే ఫ్యాషన్ వీక్ ఆడిషన్స్ నుంచి పంపించేశారు కూడా.
రియాల్టీ షోతో..
2019లో ‘సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్’ రియాల్టీ షోలో పార్టిసిపేట్ చేసింది రెనీ. ఆ షోకి పాపులర్ మోడల్, నటి మలైకా అరోరా జడ్జి. ఆ షోలో రెనీ గెలవలేదు. కానీ, తన పర్ఫార్మెన్స్తో అందర్నీ ఇంప్రెస్ చేసింది. ఆ షో తర్వాత తనకి మోడల్‌గా అవకాశాలు వచ్చాయి. ఈ ఏడాది లాక్మే ఫ్యాషన్ వీక్‌లో మలైకా అరోరాతో కలిసి ర్యాంప్ మీద నడిచింది. ఇదంతా తన పట్టుదల వల్లే సాధ్యమైంది. అంతేకాదు తనని మోడల్ కాలేవు అన్నవాళ్ల నోళ్లు కూడా మూతపడ్డాయి.