- మహబూబ్‌నగర్ జిల్లా ఉదండాపూర్ రిజర్వాయర్ వద్ద ఘటన
జడ్చర్ల, వెలుగు: ప్రమాదవశాత్తు మట్టి కోసం తీసిన గోతిలో పడి ఇద్దరు చిన్నారులు పడిపోయారు. వీరిలో తమ్ముడు మృతి చెందగా, అక్క గల్లంతు కావడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
గ్రామస్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామ శివారులో ‘పాలమూరు- రంగారెడ్డి’ స్కీములో భాగంగా రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నారు. కట్ట నిర్మాణం కోసం, ఇతర అవసరాల కోసం తవ్వకాలు చేపట్టారు. దీంతో 15 ఫీట్ల నుంచి 30 ఫీట్ల లోతు గోతులు ఏర్పడ్డాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ గోతుల్లోకి నీరు చేరింది.
రిజర్వాయర్ అసంపూర్తిగా ఉండటంతో అదే గ్రామానికి చెందిన అరెళ్ల మల్లయ్య, పార్వతమ్మ దంపతులు ఆ భూమిని సాగు చేసుకుంటున్నారు. మల్లయ్య జడ్చర్లలో కూలీ పని చేస్తుండగా, పార్వతమ్మ వ్యవసాయ పనులు చేసుకుంటోంది.
శనివారం ఇద్దరు పిల్లలు భాగ్యలక్ష్మి(6), మహేశ్(4)తో కలిసి పంటకు నీరు పెట్టేందుకు పొలానికి వెళ్లింది. పొలానికి నీరు పెడుతున్న సమయంలో పిల్లలు ఆడుకుంటూ వెళ్లి రిజర్వాయర్ కట్ట మీదకు ఎక్కారు.
అక్కడి నుంచి ప్రమాదశాత్తు కాలు జారి మట్టి కోసం తవ్వి వదిలేసిన గుంతలో పడి గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకొని బాలుడి డెడ్‌బాడీని బయటకు తీశారు. బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు జడ్చర్ల రూరల్ సీఐ ఆది రెడ్డి తెలిపారు.