
కొల్చారం, వెలుగు: మెదక్ జిల్లా కొల్చారం మండలం అప్పాజిపల్లి గ్రామంలో ఆస్తి గొడవతో అన్నపై సొంత తమ్ముడు పెట్రోలు పోసి నిప్పంటించాడు. గ్రామానికి చెందిన తిమ్మక్కపల్లి శంకరయ్య, లచ్చమ్మ దంపతులకు ప్రవీణ్, ప్రశాంత్, అశోక్ ముగ్గురు కొడుకులు. రెండో కొడుకు ప్రశాంత్ అదే గ్రామంలో ఇల్లరికం వెళ్లాడు. కొన్ని రోజులుగా ఆస్తి విషయంలో అన్నదమ్ముల మధ్య తగాదా నడుస్తోంది.
తండ్రి ఆస్తిలో తనకూ సమాన వాటా ఇవ్వాలని ఇల్లరికం వెళ్లిన ప్రశాంత్ అడుగుతుండగా దానికి మిగతా ఇద్దరు ఒప్పుకోవడం లేదు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి మళ్లీ గొడవ జరిగింది. గ్రామస్తులు కల్పించుకొని నిలువరించేందుకు యత్నించారు.
కాగా కోపంతో ప్రశాంత్ అర్ధరాత్రి అన్న ప్రవీణ్ ఇంటికి వెళ్లి బయట నిద్రిస్తుండగా అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీన్ని గమనించిన చిన్న తమ్ముడు అశోక్, స్థానికులు మంటలు ఆర్పి వేసి ప్రవీణ్‌ను మెదక్ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు.
మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అన్నపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ప్రశాంత్ కొల్చారం పొలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అతడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.