
ఏటూరునాగారం, వెలుగు: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శంకర్రాజుపల్లి గ్రామంలో తాగుడు మానుకోవాలని తమ్ముడిని మందలించినందుకు కోపంతో అన్నను రోకలి బండతో కొట్టి చంపాడు. సోమవారం సీఐ మండల రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన యానక బాబు కొంత కాలంగా మందుకు బానిసయ్యాడు. మందు తాగడం వల్ల ఆరోగ్యం కరాబైతదని అన్న యానక ముత్తయ్య (55) మందలించాడు. పిల్లలు లేకపోవడంతో తమ్ముడి బాగోగులు తానే చూసుకోవాల్సి వస్తుందని, తాగుడు బంద్ చేయాలని హెచ్చరించాడు. ఇది మనసులో పెట్టుకున్న బాబు అన్నను రోకలి బండతో తల, మెడపై బలంగా కొట్టి పారిపోయాడు. తీవ్ర గాయాలతో ముత్తయ్య స్పాట్లోనే చనిపోయాడు. మృతుడి కొడుకు దయాకర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.