- 24 గంటల్లోనే హత్య కేసును ఛేదించిన పోలీసులు
- ఫుల్‌గా మద్యం తాగించి, కొండపైకి తీసుకెళ్లిన నిందితుడు
- ఆపై కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చిండు
కీసర, వెలుగు: యువకుడి హత్య కేసును కీసర పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. సీఐ వెంకటయ్య వివరాల ప్రకారం.. కాప్రా మండలం ఎల్లారెడ్డి గూడకు చెందిన మహిపాల్ (24) డీజే ప్లేయర్‌గా పనిచేస్తున్నాడు. పనిచేసే క్రమంలో ఆర్జీకే కాలనీకి చెందిన పృథ్వీరాజ్ అతడికి పరిచయమయ్యాడు.పృథ్వీరాజ్ స్నేహంతో ఓ యువతి అతడికి పరిచయమైంది.
తొలుత పృథ్వీని సదరు యువతి ప్రేమించింది.పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో పృథ్వీని దూరం పెడుతూ మహిపాల్‌తో చనువుగా ఉంటోంది. ఇది గిట్టని పృథ్వీరాజ్ కక్ష పెంచుకున్నాడు. తన ప్రేమకు అడ్డొస్తున్నాడని మహిపాల్‌ను చంపి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఈ నెల10న మధ్యాహ్నం దమ్మాయిగూడకు మహిపాల్‌ను తీసుకెళ్లి, ఫుల్‌గా మద్యం తాగించాడు. అక్కడి నుంచి తన బండి మీద ఎక్కించుకొని నేరుగా హరిదాస్ పల్లి డంపింగ్ యార్డ్ పక్కన ఉన్న కొండపైకి తీసుకెళ్లారు. ఆపై తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. నిందితుడు పృథ్వీరాజ్‌ను తన ఇంట్లో గురువారం అదుపులోకి తీసుకొని విచారించగా, నేరం అంగీకరించాడు. దీంతో అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు సీఐ తెలిపారు.