హద్దుల్లో ‘ఆన్‌‌లైన్‌‌’ డేటింగ్.. నచ్చితే కంటిన్యూ.. లేకపోతే బ్రేకప్

నయా జమానా సోషల్ మీడియాని దాటి ఇంకో అడుగు ముందుకు వేస్తోంది. ఇప్పుడు ప్రేమకు, డేటింగ్‌‌కు కూడా ప్రత్యేకమైన యాప్స్ వచ్చేశాయి. ఈ యాప్స్‌‌లో ప్రొఫైల్ అప్‌‌లోడ్ చేస్తే చాలు. ప్రొఫైల్ నచ్చిన వాళ్లు కాంటాక్ట్‌‌లోకి వస్తారు, చాట్ చేసి మాట్లాడి ఒకరికొకరు నచ్చితే బయట కలుసుకోవచ్చు. వాట్సాప్‌‌ స్నేహాలు… ఫేస్‌‌బుక్‌‌ పరిచయాలు… టిండర్‌‌ డేటింగ్‌‌లు ఇప్పుడు మామూలైపోయాయి.

నయా టెక్నాలజీ, లైఫ్ స్టైల్ కొత్త పోకడలని తెస్తున్నాయి. అలాగే కావాల్సిన లైఫ్ పార్ట్‌‌నర్ కోసం మ్యాట్రిమొనీ సైట్లు వచ్చాయి. ఆ తర్వాత అప్‌‌డేట్ అయిన కొత్త ట్రెండ్ ‘‘డేటింగ్’’. ‘కావాల్సిన జీవిత భాగస్వామిని వెతుక్కోవటానికి ఇక్కడ అవకాశం ఉంది’ అని చెప్తారు. కానీ, అక్కడ జరిగేది వేరు అని చాలామంది ఒపీనియన్.

వినటానికి చాలాబాగా అనిపిస్తున్నా ఈ డేటింగ్ యాప్స్‌‌లో చిక్కుకుపోతే మాత్రం చాలా సమస్యలే చుట్టుముడతాయి అంటున్నారు సైకాలజిస్టులు. డేటింగ్ యాప్స్‌‌లో చురుగ్గా ఉన్న వాళ్లలో కొంతకాలం తరువాత డిప్రెషన్, సోషల్ యాంగ్జైటీ లక్షణాలు పెరిగిపోతున్నాయి. అందుకే వీలైనంత వరకు ఈ మొబైల్ డేటింగ్ యాప్స్‌‌కు దూరంగా ఉండడం మంచిదని సైకాలజిస్టులు చెబుతున్నారు.

మన దేశం మీదే ఎక్కువ దృష్టి

ఇప్పటికి మన దేశంలో పాతికేళ్ల లోపు ఉన్నవాళ్లే ఎక్కువ. అంతే కాదు 18 నుంచి 35 ఏళ్ళ మధ్య వయసు వాళ్ల లెక్క చూస్తే, వాళ్లలో దాదాపు 25 కోట్ల మంది ప్రొఫైల్ సింగిల్. అందుకే చైనాలోకన్నా మన దేశం మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నాయి ఈ డేటింగ్ యాప్స్. స్మార్ట్‌‌ఫోన్ యూజర్స్  పెరగడం కూడా మ్యాట్రిమొనీ,  డేటింగ్ యాప్స్ వ్యాపారానికి బాగా పనికొస్తోంది. అందుకే, డిజిటల్ ప్రపంచంలో ఇప్పుడు ఈ డేటింగ్ వ్యాపారం రోజురోజుకీ పెరుగుతోంది.

కొత్త కొత్త ట్రెండీ పేర్లతో

నిజానికి, పెళ్ళి కాక ముందే అబ్బాయి, అమ్మాయి కలిసి మాట్లాడుకోవటం, కలిసి తిరగటం ఇప్పుడు కొత్తగా ఉన్నదేమీ కాదు.  అయితే ఇంత ఎక్కువగా ఉండేది కాదు. ఒక అమ్మాయి అబ్బాయి కలిసి మాట్లాడుకోవాలంటే 99% ముఖపరిచయం ఉండాల్సిందే. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఎవరు.. ఎక్కడ ఉన్నా ఈజీగా పరిచయం చేసుకోవచ్చు. మాట్లాడుకోవచ్చు. కొన్నాళ్ల పరిచయం తర్వాత వద్దనుకుంటే విడిపోవచ్చు. అందుకే ఈ ట్రెండ్‌‌కి క్రేజ్ ఎక్కువగా ఉంటోంది.   టిండర్, ఓకే క్యూపిడ్, హ్యాపెన్, బంబుల్ ఇలా కొత్త కొత్త ట్రెండీ పేర్లతో యూత్‌‌ని ఆకర్షిస్తున్నాయి డేటింగ్ యాప్స్. అయితే ఇక్కడకి వచ్చే వాళ్లలో చాలామంది లాంగ్ లాస్టింగ్ అనుబంధాలని కోరుకోవటం లేదు. ఈ విషయంపై’వూస్‌‌’ అనే డేటింగ్‌‌ యాప్‌‌ సంస్థ సర్వేచేసింది. అందులో  32% మాత్రమే నిజంగా జీవిత భాగస్వామికోసం ఈ డేటింగ్ యాప్ వాడుతున్నట్టు చెప్పారు. మన దేశంలో డేటింగ్‌‌ యాప్స్‌‌ను ఉపయోగిస్తున్న వాళ్లలో 26% మహిళలు ఉన్నట్టు ఈ సర్వేలో వెల్లడైంది.

‌‌- నరేష్​కుమార్​ సూఫీ

చులకనగా చూడకూడదు 

ఇప్పుడు యూత్ ఎదుర్కొం టున్న లోన్లీనెస్ ఇలాంటి యాప్స్‌‌లోకి రావటానికి ముఖ్యమైన కారణం అవుతోంది. వర్క్‌‌లోడ్ ఎక్కువై డిప్రెషన్ నుంచి బయట పడటానికి కూడా ఇలాంటి వాటివైపు వెళ్తున్నారు. ఇక టీనేజర్స్‌‌లో ఉండే క్యూరియాసిటీతో కూడా ఇలాంటి యాప్స్‌‌ని వాడటం మొదలు పెడుతున్నారు. బ్రేకప్స్, డిప్రెషన్ కూడా కారణాలు కావచ్చు.  అయితే ఇది ఒక వ్యసనంగా మారుతుందని, ఎడిక్ట్ అయిపోతామని అనుకోకుండానే ఆ వలలో చిక్కుకుంటున్నారు.ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అందంగా ఉండమేమో అన్న అనుమానం ఉన్నవాళ్లు ఫేక్ ప్రొఫైల్స్‌‌తో డేటింగ్ యాప్స్‌‌లో ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకొని అక్కడ చేసే చాట్‌‌తో హ్యాంగవుట్ అవుతున్నారు. కానీ, అది ఎప్పటికైనా ప్రమాదమే.  పెళ్ళైన వాళ్లలోనూ ఇలాంటి  యాప్స్ చూపించే ప్రభావం తక్కువేమీ కాదు. అయితే మిగతా వ్యసనాల్లాగానే దీన్నీ చూడాలి తప్ప డేటింగ్ యాప్స్‌‌లో మోసపోయినవాళ్లని, డిప్రెషన్‌‌కి లోనవుతున్నవాళ్లని చులకనగా చూడకూడదు.   కొన్నిసార్లు ఈ అడిక్షన్ నుంచి బయట పడటం అంత సులభం కాదు. కొందరికి కౌన్సెలింగ్ అవసరం పడొచ్చు. ఈ టైంలో ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా అవసరం. ఇక పిల్లలమీద పరిమితి మించని నిఘా ఉంచక తప్పదు. నెట్‌‌లో వాళ్లు ఏం సెర్చ్ చేస్తున్నారు అని  గమనిస్తూండాలి.

– డా.జ్యోతిర్మయి  కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ , కాంటినెంటల్ హాస్పిటల్, హైదరాబాద్

జాగ్రత్తగా ఉంటే మంచిది

ఇలాంటి యాప్స్ వల్ల ఎక్కువ ఇబ్బందిపడేది అమ్మాయిలే. అందుకే ఈ ఫ్లాట్‌‌ఫామ్స్ మీద పర్సనల్ విషయాలు షేర్ చేసుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇలాంటి యాప్స్ వద్దు అని జడ్జ్ మెంటల్‌‌గా చెప్పలేం. కానీ,  ఇలాంటి పరిచయాలని మరీ ఎక్కువ మనసుకి తీసుకోవటం, ఫైనాన్షియల్ గా ఇన్వాల్వ్ కావటం మంచిది కాదు.

– పూర్ణిమ, అడ్వకేట్

ఇలాంటి పరిచయాలకోసమే

డేటింగ్ యాప్స్ లోకి వెళ్ళేది జస్ట్ ఒక హ్యాంగవుట్ కోసం. అక్కడ నచ్చిన ప్రొఫైల్‌‌ని ఫాలో అవటం వాళ్లతో మాట్లాడటం. ఒకవేళ ఇద్దరికీ ఇష్టం అయితే బయట కలవొచ్చు. దీనివల్ల ప్రమాదమా అంటే.. మన జాగ్రత్తల్లో మనం లేకుంటే ఎక్కడైనా సమస్యలు వస్తాయి. డేటింగ్ యాప్ వాడుతున్నారు అంటేనే ఇలాంటి పరిచయాలకోసమే. లాంగ్ రిలేషన్స్ కోసం ఈ ప్లాట్‌‌ఫామ్‌‌ని ఎవరూ వాడరు. నిజంగా ఫ్రెండ్‌‌షిప్, రిలేషన్ కావాలనుకుంటే ఫేస్ బుక్ లాంటివి ఉన్నాయి కదా. టిండర్, బంబుల్‌‌లో ఉన్నారు అంటేనే ‘హాయ్, బాయ్’ పరిచయాలకోసం. మళ్ళీ అక్కడ కూడా ఎమోషనల్ బాండింగ్ కావాలనుకుంటే మాత్రం ఇలాంటి యాప్స్ జోలికి పోకపోవటమే మంచిది.

– లక్ష్మణ్,  ఫిల్మ్ రైటర్

ఫ్రెండ్స్ దొరుకుతారు

మూడేళ్లు గా టిండర్ వాడుతున్నా. డేటింగ్ యాప్ అన్నప్పుడే అక్కడ క్లియర్ గా మనం ఏం కోరుకుంటున్నాం అన్నది తెలుస్తోంది కదా. ట్రస్ట్, లవ్ లాంటివి ఇక్కడ ఏమీ ఉండవు. కాకపోతే లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ కూడా ఇక్కడ దొరుకుతారు. డేటింగ్ అనగానే మరీ ఎక్కువ ఆలోచించకుండా ఒక కొత్త ఫ్రెండ్ దొరుకుతారు అనుకోవచ్చు. నా వరకైతే ఇప్పటివరకూ చెడుగా ప్రవర్తించే వాళ్లు ఎవరూ ఎదురు కాలేదు.

– రాధిక, సి.ఎ. స్టూడెంట్

ఎవరినీ కట్టడి చేయలేం

అబ్బాయిలైనా, అమ్మాయిలైనా ఒక కొత్త పరిచయం కోసం ఎగ్జైటెడ్‌‌గానే ఎదురు చూస్తారు. కానీ ఇవన్నీ పర్సనల్ లైఫ్ కి ఇబ్బంది కాకుండా ఉండాలి. ఇంటర్నెట్, సోషల్ మీడియారోజుల్లో ఎవరినీ కట్టడి చేయలేం. కానీ ఇలాంటి రిలేషన్స్ లాంగ్ టర్మ్ ఉండవు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వీటిలో ఎక్కువ సేపు మునిగిపోయి, ఆ యాప్స్‌‌లో టైం వేస్ట్ చేసుకునేంత మునిగిపోకుండా ఉండటమే మంచిది.

– అరుణాంక్ లత, లాయర్, సోషల్ యాక్టివిస్ట్

For More News..

నూట రెండేళ్ల మాష్టారు.. 70 ఏళ్లుగా పాఠాలు చెప్తున్న నందా సర్

పాపులర్‌‌‌‌ అవుతున్న లోకల్ ఓటీటీలు.. నెట్‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌, అమెజాన్‌‌‌‌ప్రైమ్‌లకు పోటీ

2021 సెలవుల లిస్ట్ వచ్చేసింది..