- రైతులకు రెజ్లర్ వినేశ్ ఫోగట్ భరోసా
- శంభూ సరిహద్దులో 200వ రోజుకు చేరిన రైతుల నిరసన
చండీగఢ్ : రైతులకు తాను కూతురిలా అండగా ఉంటానని ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగట్ అన్నారు. 200 రోజులుగా నిరసన చేస్తున్నప్పటికీ రైతుల డిమాండ్లను కేంద్ర సర్కార్ పట్టించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఎస్‌పీకి చట్టబద్దత కల్పించడంతోపాటు ఇతర డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కోరారు. కేంద్రానికి వ్యతిరేకంగా హర్యానాలోని శంభూ సరిహద్దు వద్ద రైతులు చేపట్టిన ఆందోళనలు 200వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వినేశ్ ఫోగట్ పాల్గొన్నారు.
రైతుల నిరసనకు మద్దతు తెలియజేశారు. ఫోగట్‌ను రైతులు పూలమాలలతో సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.." నేను రైతు కుటుంబంలో పుట్టడం నా అదృష్టం. పోరాటంలో మీ కుమార్తె మీతోనే ఉంది. మనకోసం ఎవరూ రారు. కాబట్టి మన హక్కుల కోసం మనమే నిలబడాలి. రైతులు తమ హక్కుల కోసం 200 రోజులుగా ఇక్కడ కూర్చుని నిరసన తెలియజేస్తున్నారు. ఇప్పటికీ కేంద్రం స్పందించకపోవడం చాలా బాధాకరం.
200 రోజుల నిరసనను పూర్తిచేయడం ఒక మైలురాయి. ఈ కార్యక్రమం ద్వారా రైతుల డిమాండ్లను మరోసారి ప్రభుత్వానికి అందజేస్తున్నాం. రైతుల డిమాండ్లు నెరవేరాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. హక్కులు సాధించుకోకుండా వెనుదిరగవద్దని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాను" అని ఫోగట్ వివరించారు.