మీ డిమాండ్లు తీర్చలేం.. గోదావరి–కావేరి అనుసంధానంపై కేంద్రం

మీ డిమాండ్లు తీర్చలేం.. గోదావరి–కావేరి అనుసంధానంపై కేంద్రం

హైదరాబాద్​, వెలుగు: గోదావరి -–కావేరి అనుసంధానం కొత్త మలుపు తీసుకున్నది. ఈ అంశంపై అన్ని రాష్ట్రాలు గొంతెమ్మ కోరికలు కోరుతున్నాయని కేంద్రం ఫైర్​ అయింది. మంగళవారం హైబ్రిడ్​ మోడల్​లో నేషనల్​ వాటర్​ డెవలప్​మెంట్​ అథారిటీ (ఎన్​డబ్ల్యూడీఏ) నిర్వహించిన మీటింగ్​లో ఎప్పటిలాగే తెలంగాణ అధికారులు తమ స్టాండ్​ వినిపించగా.. కర్నాటక, మహారాష్ట్ర కొత్త ప్రతిపాదనలను తెరపైకి తీసుకొచ్చాయి.

ఏపీ తన పాత ముచ్చటనే ముందుంచుంది. చత్తీస్​గఢ్​ అసలు మీటింగ్​కే హాజరు కాలేదు. అన్ని రాష్ట్రాలూ ఎవరికి వాళ్లు తమ వాదన వినిపించడంతో కేంద్ర జలశక్తి శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. అన్ని రాష్ట్రాల కోరికలు ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కావని తేల్చి చెప్పింది. మీటింగ్​లో ఎలాంటి కన్​క్లూజన్​ రాకపోవడంతో ఇక కేంద్రమే గోదావరి–కావేరి లింకింగ్​పై నిర్ణయం తీసుకోనున్నది.  నెలాఖరున లింకింగ్​లో భాగమైన అన్ని రాష్ట్రాలతో ఓ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నది. ఆ వెంటనే ఆయా రాష్ట్రాల సెక్రటరీలతో స్పెషల్​ టాస్క్​ఫోర్స్​ మీటింగ్​ను ఏర్పాటు చేసి ఫైనల్​ డెసిషన్​ను తీసుకోనున్నది.

 సగం వాటా కావాల్సిందే
గోదావరి –కావేరి లింకింగ్​లో భాగంగా తెలంగాణ అధికారులు సగం వాటాకు పట్టుబట్టారు. అనుసంధానంలో భాగంగా 148 టీఎంసీలు అందుబాటులో ఉండగా.. అందులో 74 టీఎంసీలు తమ వాటాగా ఇవ్వాలని  మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణ నుంచే ప్రాజెక్టును చేపడుతున్నారు కాబట్టి ఎక్కువ వాటా ఇవ్వాలని తేల్చి చెప్పారు. అంతేగాకుండా 83 మీటర్ల ఎగువ నుంచే నీటిని తీసుకోవాలని, అంతకు తక్కువ ఎత్తు నుంచి నీటిని తరలించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. దాంతో పాటు సమ్మక్కసాగర్​, దేవాదుల, సీతారామ ప్రాజెక్టులకు 152 టీఎంసీల జలాలను కేటాయించాలని తేల్చి చెప్పారు. 

ఆయా ప్రాజెక్టులకు నష్టం వాటిల్లకుండా నీటి కేటాయింపులు ఉండాలని అన్నారు. ఇటు నదుల అనుసంధానంలో భాగంగా మరో రెండు రిజర్వాయర్లను నిర్మించి ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదనలు పెట్టారు. 20 టీఎంసీల చొప్పున 40 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లను నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఇరిగేషన్కు నీళ్లేవి?
లింకింగ్​లో కర్నాటకకు ఇదివరకే తాగునీటి కోసం 16 టీఎంసీల జలాలను కేటాయించగా.. ఇప్పుడు ఆ రాష్ట్రం కొత్త మెలిక పెట్టింది. తాగునీటి కోసమే కాకుండా ఇరిగేషన్​ అవసరాలకూ నీటిని కేటాయించాలని కొత్త ప్రతిపాదనను కేంద్రం ముందు పెట్టింది. రాష్ట్రంలో ఇరిగేషన్​ అవసరాలకు నీళ్లు సరిపోవట్లేదని, కాబట్టి ఇరిగేషన్​ అవసరాలకూ నీటి కేటాయింపులు చేయాల్సిందేనని పట్టుబట్టింది. 

అయితే, ఎన్ని నీళ్లు కావాలన్న దానిపై మాత్రం ఆ రాష్ట్రం వివరాలు చెప్పలేదు. దీనికి కూడా కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. అసలు కర్నాటకకు ఇందులో అతి తక్కువ భాగం ఉందని, అలాంటప్పుడు ఇరిగేషన్​ అవసరాలకు నీళ్లెలా ఇస్తారని ప్రశ్నించింది. తాగునీటికే కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేసింది. 

పోలవరం నుంచి లింక్​ సాధ్యం కాదు..
ఏపీ కూడా పాత పాటే పడింది. ఇచ్చంపల్లి నుంచి అనుసంధానాన్ని పక్కనపెట్టాలని కేంద్రానికి తెలిపింది. పోలవరం నుంచి పెన్నా రీజియన్​ ద్వారా కావేరి లింక్​ను చేపట్టాలని కోరింది. ఇక్కడ నీటి లభ్యత కూడా ఎక్కువ ఉంటుందని, తద్వారా రాష్ట్రాల అవసరాలు తీర్చేందుకు సరిపోతాయని తెలిపింది. అయితే, కేంద్రం అందుకు తిరస్కరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అది సాధ్యపడదని తేల్చి చెప్పింది. కావాలంటే ఇంట్రా లింక్​ కింద ఆ ప్రాజెక్టును చేపట్టుకోవచ్చని ఏపీకి స్పష్టం చేసింది. ఇటు మహారాష్ట్ర కూడా మరో కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. 

ఇదివరకు తెచ్చిన మహానది –గోదావరి లింకింగ్​లో మహారాష్ట్రకు కేటాయింపులు చేస్తామని కేంద్రం చెప్పినా.. ఇప్పుడు మరో కొత్త ప్రతిపాదనను మహారాష్ట్ర తెరపైకి తెచ్చింది. వైతరణి, దమనగంగ, గోదావరి లింక్​ చేయాలని కేంద్రాన్ని కోరింది. అయితే, ఈ ప్రతిపాదనకూ కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది కూడా ఇంట్రాలింక్​ ప్రాజెక్ట్​ కిందకే వస్తుందని స్పష్టం చేసింది. 

రాష్ట్రాల ప్రతిపాదనలపై అసంతృప్తి
రాష్ట్రాల ప్రతిపాదనలపై కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశిష్​ మహంతి అసంతృప్తి వ్యక్తంచేశారు. అక్కడ అందుబాటులో ఉన్నదే 148 టీఎంసీలని, కానీ, అన్ని రాష్ట్రాల కోరికలు వింటుంటే 400 టీఎంసీలైనా సరిపోవని అన్నారు. ఇంటర్​ లింకింగ్​ ప్రాజెక్ట్​ అన్ని రాష్ట్రాల బాగు కోసం చేస్తున్నదని, కొంచెం ఆలోచించి ప్రాజెక్టుకు ఒప్పుకోవాలని కోరారు. ఒకవేళ రాష్ట్రాలు కావాలనుకుంటే ఇంట్రా లింకింగ్​ (రాష్ట్రంలోపల చేపట్టే అనుసంధానం) ప్రాజెక్టులకు కేంద్రం తరఫున సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఈ నెలాఖరున జరిగే మీటింగ్​లో అనుసంధానంపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తున్నది. 

రాష్ట్రానికి ముందు చెప్పిన 42 టీఎంసీల వాటాను ఇచ్చి.. మిగతా రాష్ట్రాలకు పాత పద్ధతిలోనే కేటాయింపులు చేసి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని యోచిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రాలు ఎటూ తేల్చకపోవడం.. ప్రాజెక్టును ముంగటపడనివ్వకపోతుండడంతో ఇకపై కేంద్రమే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని డిసైడ్​ అయినట్టు అధికారుల చెబుతున్నారు.