మేడిగడ్డపై మీ రిపోర్టు సరికాదు..ఎన్డీఎస్ఏకు తెలంగాణ లేఖ

నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి తెలంగాణ లేఖ

హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీని పూర్తిగా పరిశీలించకుండానే నేషనల్ డ్యామ్‌‌ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదిక ఇవ్వడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందని రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్‌‌మెంట్ పేర్కొంది. మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌‌లో పిల్లర్ కుంగడంపై ఎన్డీఎస్ఏ ఎక్స్‌‌పర్ట్ కమిటీ ఇచ్చిన రిపోర్టుకు కౌంటర్‌‌‌‌గా ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ శనివారం ఎన్డీఎస్ఏ చైర్మన్ సంజయ్ కుమార్ సిబల్‌‌కు ఆరు పేజీల లేఖ రాశారు. ఎన్డీఎస్ఏ నివేదికలో లేవనెత్తిన అంశాలకు వివరణ ఇచ్చారు.

పిల్లర్లు కుంగడంపై ఎక్స్​పర్ట్​ కమిటీ సరిగా స్టడీ చేయలేదు. అప్పుడు బ్యారేజీలో నీరు నిల్వ ఉండటమే అందుకు కారణం. ఏడో బ్లాక్‌‌లో పిల్లర్లు కుంగడానికి కారణాలు స్టడీ చేయడానికి.. బ్యారేజీని నిర్మించిన ఏజెన్సీ ప్రస్తుతం అక్కడ కాఫర్​డ్యామ్‌‌ నిర్మించి నీటిని మళ్లిస్తున్నది. ఇప్పుడు మాత్రమే కారణాలు ఏమిటో తెలుసుకునే చాన్స్ ఉంది. ఈ పరిస్థితుల్లో ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక మాకు ఆమోదయోగ్యం కాదు’’ అని స్పష్టం చేశారు. ‘‘బ్యారేజీకి సంబంధించిన 20 రకాల డాక్యుమెంట్లు కోరితే 11 మాత్రమే ఇచ్చారనేది కూడా నిజం కాదు. 

బ్యారేజీని పరిశీలించినప్పుడు, మాతో సమావేశంలోనూ పలు డాక్యుమెంట్లను చూపించాం. 20 రకాల డాక్యుమెంట్లు ఇవ్వాలని కోరుతూ 27న లేఖ రాసి 29న డెడ్​లైన్​పెట్టారు. 17 రకాల డాక్యుమెంట్లను ఎన్డీఎస్ఏకు ఈ మెయిల్​చేశాం. మిగతా మూడు రిపోర్టులు నవంబర్ ఒకటో తేదీన సమర్పించాం” అని పేర్కొన్నారు.

అన్ని క్వాలిటీ కంట్రోల్​పరీక్షలు నిర్వహించినం

బ్యారేజీపై లోడ్ కారణంగా ఎగువ, దిగువన సెకాంట్ పైల్స్​వైఫల్యం చెందాయని పేర్కొన్నారని, సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు, ఉత్తరాఖండ్‌‌లోని తోపవన్​ ప్రాజెక్టు నిర్మాణంలో అనుసరించిన ప్రొటోటైప్ పద్ధతులనే మేడిగడ్డలోనూ పాటించామని లేఖలో రజత్‌‌కుమార్ తెలిపారు. బ్యారేజీ ఎగువ, దిగువ సెకాంట్​పైల్స్‌‌ను ప్రధాన పునాదితో ఫ్లెక్సిబుల్ జాయింట్స్‌‌తో అనుసంధానించామని చెప్పారు. బీఐఎస్ స్టాండర్డ్స్, నిర్దేశిత గైడ్‌‌లైన్స్​కు లోబడే సెకాంట్ పైల్స్ కార్యకలాపాలు ఉంటాయని, బ్యారేజీకి ఎగువ, దిగువన కాంక్రీట్ గైడ్​వాల్స్ నిర్మించి బ్లాక్​లు, క్రాస్ కటాఫ్​లను డబుల్ పైర్లలో అనుసంధానం చేశామని వెల్లడించారు. 

పిల్లర్లను స్లాబ్​తో అనుసంధానం చేసేందుకు కాపర్ వాటర్ స్టాపర్లు, రబ్బర్ వాటర్ స్టాపర్లను ఉపయోగించామని తెలిపారు. పునాది, సెకాంట్ పైల్స్ నిర్మాణం కోసం సిమెంట్, కంకర ఇతర, పదార్థాలను నిబంధనలకు లోబడి తనిఖీలు చేసిన తర్వాతే ఉపయోగించామని తెలిపారు. అన్నిరకాల క్వాలిటీ కంట్రోల్ పరీక్షలు నిర్వహించామని, ఎక్స్‌‌పర్ట్‌‌ కమిటీ నివేదికలో చేసిన కామెంట్స్‌‌ను తాము అంగీకరించబోమని తేల్చిచెప్పారు. 

సీబీఐపీలో మాన్యువల్​ నం.179 ప్రకారమే బ్యారేజీ ఫౌండేషన్ ఆర్సీసీ రాఫ్ట్ మోడల్​లో డిజైన్ చేశామని, ఫౌండేషన్‌‌పై ప్రభావం పడకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. బ్యారేజీకి సంబంధించిన ఆప్రాన్ డిజైన్స్​ను రివిజన్ చేయాల్సి ఉందని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్​ గుర్తించిదని, దీనిపై ఐఐటీ హైదరాబాద్​తో కలిసి స్టడీ చేస్తున్నామని తెలిపారు. మూడేండ్లుగా గోదావరిలో వరదలు కొనసాగుతున్నామని, అందుకే ఆప్రాన్ డిజైన్లను సరిచేయలేకపోయామన్నారు.

అన్నారం, సుందిళ్లను పరిశీలించకుండానే

నేషనల్​ డ్యామ్‌‌ ​సేఫ్టీ యాక్ట్ 2021 డిసెంబర్ 13 నుంచి అమల్లోకి వచ్చినా దాని పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులు, బ్యారేజీలపై ఎన్‌‌డీఎస్ఏనే స్పష్టత ఇవ్వలేదని లేఖలో రజత్‌‌ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ డ్యామ్‌‌ సేఫ్టీ ఆర్గనైజేషన్​ ఇదే విషయాన్ని లేవనెత్తిందని, 2023 మార్చి 15న వర్చువల్​గా నిర్వహించిన సమావేశంలో ఈ అంశం ప్రస్తావించామని, ఏప్రిల్​1న దీనిపై ఈ మెయిల్​ పంపామని తెలిపారు. 2023 జులై 12న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ జాబితాలో చేర్చారని తెలిపారు. 

వర్షాకాలం ప్రారంభానికి ముందు జులైలో బ్యారేజీ వద్ద తనిఖీలు చేపట్టామని, నవంబర్​లో వర్షాకాలం తర్వాతి తనిఖీలు పూర్తయ్యాయన్నారు. బ్యారేజీని పునరుద్ధరించే వరకు దాన్ని వినియోగించబోమని తెలిపారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించకుండానే వాటి భద్రతపై ఎన్డీఎస్ఏ కమిటీ సందేహాలు లేవనెత్తిందన్నారు. వాటి భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మేడిగడ్డ కు సంబంధించి తలెత్తిన సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, ఈ విషయంలో ఎన్డీఎస్ఏ చేసే సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. 

ఈ ప్రాజెక్టు కారణంగా రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1.28 లక్షల నుంచి రూ.3.17 లక్షలకు పెరిగిందన్నారు. తెలంగాణకు ఎంతో ప్రయోజనం చేసే ఈ బ్యారేజీ పునరుద్ధరణకు తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.