యూత్, టూరిజం సెక్రటరీగా స్మితా సబర్వాల్

హైదరాబాద్​, వెలుగు:  రాష్ట్రంలో 13 మంది ఐఏఎస్‌‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. వీరితో పాటు మరో 8 మంది ఐఎఫ్ఎస్ అధికారులను ట్రాన్స్​ఫర్​ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. యూత్ అండ్ టూరిజం కల్చరల్ డిపార్ట్​మెంట్ సెక్రటరీగా స్మితా సబర్వాల్ ను నియమించింది. దీంతోపాటు ఆమె తెలంగాణ స్టేట్​ ఫైనాన్స్​ కమిషన్​ మెంబర్​ సెక్రటరీగా, ఆర్కియాలజీ డైరెక్టర్​గా అదనపు బాధ్యతలు చూడనున్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను ఇరిగేషన్​ సెక్రటరీ పోస్టు నుంచి స్టేట్​ ఫైనాన్స్​ కమిషన్​ మెంబర్​ సెక్రటరీగా పంపారు. ప్రస్తుత పోస్టింగ్​తో ఆమె తిరిగి సెక్రటేరియెట్​లో అడుగుపెట్టనున్నారు.  

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌‌ఎంసీ) కమిషనర్‌‌గా పూర్తి స్థాయిలో ఇలంబర్తి  నియమితులయ్యారు. ఎక్సైజ్​ శాఖ కమిషనర్​ శ్రీధర్​ను  బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా, అదనపు బాధ్యతల కింద దేవాదాయ శాఖ కమిషనర్‌‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. సీహెచ్‌‌ హరికిరణ్‌‌ ను  ఎక్సైజ్‌‌ శాఖ డైరెక్టర్‌‌గా నియమించింది. ఫైనాన్స్​ స్పెషల్​ సెక్రటరీగా ఉన్న డి.కృష్ణ భాస్కర్‌‌ ను  ట్రాన్స్‌‌ కో సీఎండీగా బదిలీ చేసింది. ఆయన డిప్యూటీ సీఎం స్పెషల్​ సెక్రటరీగా అదనపు బాధ్యతలను కూడా చూస్తున్నారు. ఇటీవల ఏపీ నుంచి తెలంగాణకు వచ్చిన ఐఏఎస్​ సృజనను ప్రభుత్వం  పంచాయతీరాజ్,  గ్రామీణాభివృద్ధి డైరెక్టర్‌‌గా నియమించింది. 

లేబర్​ కమిషనర్​గా ఉన్న ఎస్‌‌. కృష్ణ ఆదిత్యను బదిలీపై ఇంటర్‌‌ బోర్డు డైరెక్టర్​గా నియమించింది. లేబర్​ కమిషనర్ గా ప్రిన్సిపల్​ సెక్రటరీ సంజయ్​ కుమార్​కు బాధ్యతలు అప్పగించింది. అనితా రామచంద్రన్‌‌ కు మహిళా, శిశు సంక్షేమంతో పాటు  ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు ఇచ్చింది.  మైన్స్​ అండ్​ జియాలజీ సెక్రటరీ కె. సురేంద్ర మోహన్‌‌​కు రవాణాశాఖ కమిషనర్‌‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఏపీ నుంచి వచ్చిన మరో ఐఏఎస్​ శివశంకర్‌‌ను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోగా ప్రభుత్వం నియమించింది. చిట్టెం లక్ష్మిని ఆయుష్​ డైరెక్టర్​గా పోస్టింగ్​ ఇచ్చింది. ఇక ఢిల్లీలోని తెలంగాణ భవన్​ రెసిడెంట్​ కమిషనర్​ డాక్టర్​ గౌరవ్​ ఉప్పల్​ కు కో ఆర్డినేషన్​–గవర్నమెంట్​ ఆఫ్​ ఇండియా ప్రాజెక్ట్స్​ సెక్రటరీగా నియమించింది.  

చార్మినార్​ సర్కిల్​ సీసీఎఫ్​గా ప్రియాంక వర్గీస్​

ఐఏఎస్​లతో పాటు  8 మంది ఐఎఫ్ఎస్​ ఆఫీసర్లను ప్రభుత్వం బదిలీ చేసింది.  ప్రియాంక వర్గీస్‌‌ను చార్మినార్ సర్కిల్ సీసీఎఫ్‌‌గా, శివాలా రాంబాబును గద్వాల జిల్లా అటవీ అధికారిగా, డాక్టర్ సునీల్ ఎస్.హిర్మిత్‌‌ను నెహ్రూ జూ పార్క్ డైరెక్టర్‌‌గా నియమించింది. పి.శ్రీనివాస్ రావును సిద్దిపేట జిల్లా అటవీ అధికారిగా, ఎస్వీ ప్రదీప్ కుమార్ షెట్టి డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌‌గా కె. శ్రీనివాస్‌‌ను, హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్‌‌గా, జె.వసంతను నెహ్రూ జూ పార్క్ క్యూరేటర్‌‌గా, ఎం.నవీన్ రెడ్డిని భూపాల పల్లి జిల్లా అటవీ అధికారిగా నియమించింది.