హైదరాబాద్: కాంగ్రెస్ లో యువతకు ప్రాధాన్యం పెరుగుతోంది. పీసీసీలో కీలక పదవులను యువనాయకత్వానికి అప్పగించే అవకాశం ఉంది. పీసీసీ చీఫ్ ఎంపిక తుది దశకు చేరుకొన్న నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఎవరికి అవకాశం కల్పిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. కొత్త తరాన్ని రాజకీయాల్లో ప్రోత్సహించాలనే తలంపుతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రానికి చెందిన యువ నాయకులకు కీలక పదవులు కూడా దక్కాయి. సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ను అనూహ్యంగా రాజ్యసభకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
ఎన్ ఎస్ యూఐ నాయకుడిగా, విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన పోరాడిన బల్మూరి వెంకట్ ను ఇటీవలే ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీగా నియమించారు. ఈ నేపథ్యంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, విస్తరణపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ నాయకత్వం ఈ సారి యువకులను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఎవరికి అవకాశం లభిస్తుందనే చర్చ జరుగుతోంది. నీట్ లీకేజీలపై యువ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోరాటాన్ని ఉధృతం చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ లో నిర్వహించిన ఆందోళనలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చురుకుగా పాల్గొన్నారు. చురుకుగా ప్రజల్లోకి వెళ్లగలిగే నాయకులను బాధ్యతలు అప్పగించడం ద్వారా సక్సెస్ అవుతామని భావిస్తున్న కాంగ్రెస్ అధినాయకత్వం ఎన్ ఎస్ యూఐ, యూత్ కాంగ్రెస్ నాయకులకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో బల్మూరి వెంకట్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తదితరుల పేర్లను పరిశీలిస్తోందని తెలుస్తోంది.