పోలీస్ స్టేషన్లో యువకుడు ఆత్మహత్యాయత్నం

పోలీస్ స్టేషన్లో యువకుడు ఆత్మహత్యాయత్నం
  • ప్రేమ వ్యవహారంలో స్టేషన్కు పిలిపించిన సందర్భంలో ఘటన
  • ఎస్ఐ గదిలో ఫ్యాన్​కు ఉరేసుకున్న యువకుడు

నిజామాబాద్, వెలుగు: ప్రేమించి పెండ్లి చేసుకున్న యువ జంటను విచారించడానికి రూరల్​ పోలీసులు స్టేషన్​కు పిలవగా, యువకుడు యువతి చున్నీతో అత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మంగళవారం సాయంత్రం జరిగిన ఘటన కలకలం లేపింది. సంగారెడ్డి జిల్లాకు చెందిన మచ్చ రమేశ్​గౌడ్(23) 20 ఏండ్ల యువతిని ప్రేమించాడు. యువతి పేరెంట్స్ ఉపాధి కోసం సంగారెడ్డిలో మూడేండ్లు ఉన్నప్పుడు వీరు ప్రేమించుకున్నారు. ప్రస్తుతం యువతి తల్లిదండ్రులు నగర శివారులోని ముబారక్​​నగర్లో ఉంటున్నారు. మేజర్​ అయిన యువతీ, యువకులు పెండ్లి చేసుకోడానికి వారం కింద తమ ఇండ్ల నుంచి వెళ్లిపోయారు. యువతితో పాటు 17 ఏండ్ల చెల్లిని కూడా వెంట తీసుకెళ్లింది. ఈ ఘటనపై పేరెంట్స్​ ఫిర్యాదు మేరకు రూరల్​ స్టేషన్​లో మిస్సింగ్​ కేసు​ నమోదు చేశారు. యువతికి పోలీసులు ఫోన్​ చేయగా, తాము గుడిలో పెండ్లి చేసుకున్నామని తెలిపింది. 

పోలీసుల సూచన మేరకు మంగళవారం వారు రూరల్​ పోలీస్​స్టేషన్కు వచ్చారు. కోపంలో ఉన్న  యువతి బంధువులు రమేశ్​గౌడ్​పై దాడి చేస్తారని భావించిన ఎస్ఐ మహేశ్​ తన గదిలో అతడిని కూర్చోబెట్టి, యువతిని, ఆమె పేరెంట్స్ను వేర్వేరుగా ఉంచారు.  క్రైం మీటింగ్​ నిర్వహించేందుకు హాల్లోకి వెళ్లాడు. ఇంతలో యువతి వద్దకు వచ్చిన రమేశ్​గౌడ్​ ఆమె చున్నీ తీసుకొని, ఎస్ఐ గదిలోకి వెళ్లి ఫ్యాన్​కు ఉరి బిగించుకున్నాడు. అక్కడే ఉన్న రమేశ్​గౌడ్​ స్నేహితుడు కేకలు పెట్టగా.. పోలీసులు కిందకు దింపి హాస్పిటల్ కు తరలించారు. సీపీ కల్మేశ్వర్  హాస్పిటల్​కు వచ్చి వివరాలు తెలుసుకున్నారు. రమేశ్​గౌడ్​కు ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు.

ఫైనాన్స్​ వ్యాపారి వేధింపులతో మహిళ ..
కామారెడ్డి, వెలుగు: ఫైనాన్స్​ వ్యాపారి వేధింపులు భరించలేక కామారెడ్డి సమీపంలోని దేవునిపల్లికి చెందిన లక్ష్మీబాయి(40) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఫైనాన్స్​ వ్యాపారి తనను వేధిస్తున్నాడని బాధితురాలు ఓ వీడియో రిలీజ్​ చేసింది. లక్ష్మీబాయి ఇండ్ల నిర్మాణం చేస్తుంది. ఇందుకోసం వ్యాపారి విశ్వనాథం దగ్గర రూ.32 లక్షల అప్పు తీసుకుంది. ఇందుకు గ్యారంటీగా ఇల్లు, 2 ఫ్లాట్లను జీపీఏ చేసి ఇచ్చింది.

అప్పు చెల్లించినప్పటికీ ప్లాట్లను తన పేరిట మార్చడం లేదని, తెల్ల పేపర్లపై సంతకాలు తీసుకొని రిజిస్ట్రేషన్​ చేసుకున్నాడని బాధితురాలు వాపోయింది. ఇంకా తనకు రూ.56 లక్షలు ఇవ్వాలని, తన ఇంటికి వచ్చి గొడవకు దిగాడని ఆరోపిస్తోంది. సోమవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా.. ఆమెను వెంటనే హాస్పిటల్​కు తరలించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విశ్వనాథంపై కేసు నమోదు చేసినట్లు దేవునిపల్లి ఎస్ఐ రాజు తెలిపారు. తమ ఇంటికి వచ్చి వ్యాపారి గొడవ చేశాడని, దౌర్జన్యం చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు.