నోటిఫికేషన్లు రాక.. భృతి ఇయ్యకనే నిరుద్యోగుల ఆత్మహత్యలు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే.. మన కొలువులు మనకే వస్తయని, మన నీళ్లు, నిధులు మనమే వాడుకోవచ్చనే ఉద్దేశంతో చిన్న.. పెద్ద తేడా లేకుండా సకల జనులు రోడ్డెక్కి ఉద్యమం చేశారు. యూనివర్సిటీలు, కాలేజీల్లో చదువులు పక్కకు పెట్టి విద్యార్థులు, నిరుద్యోగ యువకులు ఉద్యమంలో ముందుండి కొట్లాడారు. ప్రాణాలను సైతం అర్పించి ఉద్యమానికి ఊపిరి పోశారు. అమరుల ఆత్మ బలిదానాల పునాదులపై ఏర్పడిన ప్రభుత్వం.. వారి త్యాగాలను మరిచిపోయింది. అటు నిరుద్యోగ భృతి ఇయ్యక.. ఇటు ఉద్యోగాల భర్తీ చేపట్టక విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేస్తోంది. కొలువులు వస్తాయన్న ఆశలు ఆవిరై.. ఎంతో మంది నిరుద్యోగులు ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం మరో ఉద్యమం నిర్మించాల్సిన సమయం వచ్చింది.

తెలంగాణ సమాజానికి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అరవై ఏండ్ల చిరకాల స్వప్నం. హైదరాబాద్ స్టేట్, ఆంధ్ర రాష్ట్రంతో  కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటు చేసినప్పటి నుంచి  తెలంగాణ సమాజంలో అనేక అనుమానాలు, అపోహలు ఉన్నాయి. పాలకుల ప్రవర్తన, పాలన తీరు కూడా అనుమానాలకు బలం చేకూరుస్తూ.. వాటిని విభేదాల స్థాయికి తీసుకెళ్లాయి. పోరాడే తత్వం, ప్రశ్నించే గుణం, త్యాగ నిరతి గల తెలంగాణ ప్రజలు ఈ అన్యాయాలను ఎదిరిస్తూ  స్వయం పాలన కావాలని, మా నిధులు మాకే ఖర్చు పెట్టాలని,  ఆత్మ గౌరవ నినాదం ఎత్తుకున్నారు. ముల్కీ నిబంధనల నుంచి మొదలుకుని ప్రత్యేక రాష్ట్రం వరకు పోరాటం చేశారు. ఈ పోరులో ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ యువత ముందుండి కొట్లాడింది. విద్యార్థులు వారి భవిష్యత్ ను పణంగా పెట్టి కదం తొక్కారు. తొలి దశ తెలంగాణ ఉద్యమం నుంచి మలి దశ ప్రత్యేక రాష్ట్ర పోరాటం వరకు కొన్ని రాజకీయ పార్టీలు అధికారం కోసం, ఆధిపత్యం కోసం ఇక్కడి  ప్రజలను, యువతను నిర్లక్ష్యం చేస్తూ కుట్ర రాజకీయాలతో అందలం ఎక్కే ప్రయత్నం చేశాయి. స్థానికత పునాదుల మీద మొదలైన మలి దశ ఉద్యమానికి  ఈ ప్రాంత యువత ఊపిరిగా నిలిచింది. ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమరణ దీక్ష విరమించిన తర్వాత యువత ముందుండి ఉద్యమానికి నాయకత్వం వహించింది. టక్కు టమార విద్యల్లో నిపుణుడైన కేసీఆర్ యువ శక్తికి భయపడే మళ్లీ ఉద్యమంలోకి వచ్చాడు. చివరకు పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతుతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది.

నోటిఫికేషన్లు లేక..
2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్​పార్టీ విద్యార్థి, యువతను ప్రసన్నం చేసుకోవడం కోసం ఎన్నో హామీలు ఇచ్చింది.  గెలిచిన తర్వాత.. ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాల్సిన కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యర్థి పార్టీల నాయకులను లోబరుచుకోవడం మొదలు పెట్టింది. ఉద్యమానికి ఊపిరిలూదిన యూనివర్సిటీలను, కాలేజీలను పట్టించుకోలేదు. విద్యార్థి వర్గాన్ని నిర్లక్ష్యం చేయడమే గాకుండా వారి పోరాట పటిమను కించపరిచింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా నిర్ణయాలు తీసుకుంది. త్వరలో నోటిఫికేషన్లు అంటూ నిరుద్యోగ యువతను మభ్యపెట్టేలా ప్రకటనలు ఇవ్వడం పరిపాటిగా మారింది. ఉద్యోగాల భర్తీ, ఉపాధి కల్పనపై ఒక్కో నాయకుడు ఒక్కోలా మాట్లాడటం నిరుద్యోగులను ఆందోళనకు గురి చేస్తోంది. డిగ్రీలు, పీజీలు చేసి పోటీ పరీక్షల కోసం ఏండ్లుగా ప్రిపేరవుతున్న యువత ఉద్యోగాల భర్తీ లేక ఆత్మహత్యలకు పాల్పడుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒక్క గ్రూప్1 నోటిఫికేషన్ కూడా విడుదల చేయక పోవడం ఎంతో బాధాకరం. గ్రూప్ 2 నుంచి కొన్ని పోస్టులను వేరు చేసి గ్రూప్ 3లో పేర్కొన్న ప్రభుత్వం.. ఆ ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్​ ఇయ్యలేదు. రోజు రోజుకూ పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలను చూసి చలించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీజేపీ కార్యకర్తలు, నాయకులపై అధికార పార్టీ లీడర్లు ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకుంటున్నారు. ఉచిత పథకాల హామీలు ఇచ్చి, ఆంధ్ర ఆధిపత్యం మళ్లీ వచ్చే ప్రమాదం ఉందని బూచి చూపించి 2018లోనూ అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్​పార్టీ.. నిరుద్యోగులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నిరుద్యోగ భృతి పురోగతి ఎక్కడి వరకు వచ్చిందనే విషయం తెలుసుకోవడానికి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తుకు ప్రయత్నిస్తే.. నిరుద్యోగి అనే అంశం ప్రభుత్వంలో ఏ శాఖ కిందకు వస్తుందో ప్రభుత్వానికే అవగాహన లేని దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. 

ఎన్నికల ముందు హామీలు
దుబ్బాక బైపోల్, జీహెఎంసీ ఎన్నికలు, నాగార్జున సాగర్, హుజూరాబాద్ ఉప ఎన్నికలు, ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ‘త్వరలో 50 వేల ఉద్యోగాల భర్తీ’ అంటూ టీఆర్ఎస్​ పార్టీ విద్యార్థులు, నిరుద్యోగులతో ఓట్లు వేయించుకుంది. కానీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​ మాత్రం ఇవ్వలేదు. సర్కారు కొలువుల కోసం కండ్లళ్లో ఒత్తులు వేసుకొని చదువుకున్న యువకులు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రాక ప్రాణం తీసుకుంటున్నారు. సూర్యాపేటకు చెందిన రాంగోపాల్, నారాయణపేటకు చెందిన నరసింహ, మహబూబాబాద్‌‌‌‌కు చెందిన  ముత్యాల సాగర్ మొదలుకుని గతంలో ఆత్మహత్య చేసుకున్న వరంగల్​కు చెందిన మహేశ్,  జమ్మికుంటలో షబ్బీర్, నల్గొండలో శ్రీకాంత్, ఉస్మానియా వర్సిటీ పీహెచ్​డీ స్కాలర్ ఉప్పరాజు, ఖమ్మంలో నాగేశ్వర్ రావు , సూర్యాపేటలో సాయి వరకు ఇంకా ఎంతో మంది విద్యవంతులు ఈ ప్రభుత్వ  బాధ్యతా రాహిత్యం వల్ల చనిపోయారు.  అధికార పార్టీకి ప్రకటనలు, ప్రచారంలో ఉన్న శ్రద్ధ ఉపాధి కల్పించడంలో లేకపోవడం వల్లే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయి. ఉద్యోగాలు భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న భారతీయ యువ మోర్చా కార్యకర్తలను అరెస్ట్ చేయడం దారుణం. అక్రమ కేసులు బనాయించడం, భౌతిక దాడులు చేయడం చూస్తుంటే ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం మరో ఉద్యమం నిర్మించాల్సిన సమయం వచ్చిందనిపిస్తోంది. 

ఆత్మహత్యలొద్దు..
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా యువతకు ఉపాధి కల్పించే చర్యలు చేపడుతోంది. ప్రధానమంత్రి ముద్ర యోజన ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 28,12,588 మందికి 23,845 కోట్ల రూపాయలు స్వయం ఉపాధి కల్పన కోసం నిధులు మంజూరయ్యాయి. కౌశల్ వికాస యోజన ద్వారా నిరుద్యోగ యువతకు తర్ఫీదు ఇచ్చి ఇష్టమైన రంగంలో ఉపాధి కల్పించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీనికి కేంద్రం పెద్ద మొత్తంలో  నిధులు విడుదల చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం వాటిని సరిగా ఉపయోగించడం లేదు. పైగా వాటిని ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తోంది. రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ అండగా ఉంటుందని మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకుంది. ఇప్పుడు మళ్లీ హామీ ఇస్తోంది..  యువత ఆత్మ హత్యలు చేసుకోవద్దు. బీజేపీ అధికారంలోకి రాగానే ఉద్యమ ఆకాంక్షలు తీర్చేందుకు కృషి చేస్తుంది. అధికార అహంకారంతో దాడులకు దిగుతున్న టీఆర్ఎస్ పార్టీతో ఢీకొనాల్సిందే. మన త్యాగాలను సోపానాలుగా అందలం ఎక్కి మనల్నే పాతాళానికి తొక్కుతున్న ఈ కేసీఆర్ పాలనను భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోడీ అండతో అంతం చేసి, నవ భారత నిర్మాణానికి తెలంగాణ నుంచే పునాది వేద్దాం.

- సుమిరన్ కొమఱ్ఱాజు, బీజేపీ రాష్ట్ర నాయకులు