
ఓ యువకుడికి రూ.45 లక్షల ప్యాకేజితో మంచి ఉద్యోగం వచ్చింది.. దీంతో తమ కుమారుడి లైఫ్ సెట్ అయింది.. ఇక అంతా సాఫీగా సాగిపోతుంది అనుకున్నారు ఆ యువకుడి తల్లిదండ్రులు. కానీ ఆ పేరెంట్స్ ఆశలు కొద్ది రోజుల్లోనే అడియాశలు అయ్యాయి. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివి భారీ ప్యాకేజీతో ఉద్యోగం సాధించిన యువకుడు ఏ కష్టమొచ్చిందో తెలియదు కానీ.. ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. ఈ హృదయ విదారకర ఘటన ఆంధ్రప్రదేశ్లో జరిగింది. వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామానికి చెందిన వరికుంట్ల అమర్నాథ్ చెన్నైలోని ఓ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు.
ఈ క్రమంలోనే గురువారం (మార్చి 13) హైదరాబాద్ కాచిగూడలో ట్రైన్ ఎక్కి గిద్దలూరు వెళ్లాడు. అక్కడ ఓ గూడ్స్ రైలు పైకి ఎక్కి ఏకంగా హై టెన్షన్ వైర్లు పట్టుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన అధికారులు గాయపడ్డ అమర్నాథ్ను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి శుక్రవారం (మార్చి 14) మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అమర్నాథ్ మృతికి గల కారణాలపై పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు.
ఆత్మహత్యకు ప్రేమే కారణమా..!
అమర్నాథ్ చెన్నైలోని ఓ ప్రముఖ ఇంజనీరింగ్ యూనివర్సిటీలో బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ 45 లక్షల ప్యాకేజీని అమర్నాథ్‌కు ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. చేతికొచ్చిన బిడ్డ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అసలు అమర్నాధ్ ఎందుకు ఆత్మహత్యాయత్నం చేయాల్సి వచ్చిందో అర్ధం కావడం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే అమర్నాథ్ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా అనుమానిస్తున్నారు. తాను ప్రేమించిన యువతితో పెళ్ళి జరగదన్న మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు.