రోడ్ల రిపేర్ కోసం ప్రతిపక్ష పార్టీల నేతలు, వివిధ ప్రజా సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో మహిళా కాంగ్రెస్ నేత.. భర్తతో కలిసి రోడ్డుపై బైఠాయించిన ఘటన మరువకముందే తాజాగా గన్నేరువరం మండల కేంద్రంలో రోడ్డు మరమ్మతుల కోసం యువజన సంఘాలు నిరసన చేపట్టాయి. జోలె పట్టి బిక్షాటన చేశారు. రోడ్డు మరమ్మతుల కోసం యువజన సంఘాల ప్రతినిధులు గత కొన్ని నెలలుగా పోరాటం చేస్తున్నారు. రాజీవ్ రహదారి గుండ్లపల్లి స్టేజ్ నుండి గన్నేరువరం మండల కేంద్రానికి వెళ్లే రోడ్డు పూర్తిగా గుంతలు ఏర్పడడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వెల్లడించారు.
గుండ్లపల్లి స్టేజ్ నుండి ఇల్లంతకుంట మండలం పోత్తూర్ వరకు డబుల్ రోడ్డుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకు ఇష్టం వచ్చినట్లు వాగ్దానాలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. మండల కేంద్రానికి డబుల్ రోడ్డు నిర్మిస్తానని గతంలో ఎమ్మెల్యే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. డబుల్ రోడ్డు కొరకు రూ.67 కోట్లు నిధులు మంజూరయ్యాయంటూ ఇటీవల బీఆర్ఎస్ నాయకులు మండల కేంద్రంలో సంబరాలు జరిపారని, రోడ్డు కోసం ఆ నిధులు మంజూరైతే అధికారికంగా ప్రకటించి వెంటనే రోడ్ నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రోడ్డు వేసేంత వరకు పోరాటం ఆగదని యువజన సంఘాలు స్పష్టం చేశారు. భిక్షాటనతో వచ్చిన రూ.25 వేలతో దారిలో ఉన్న గుంతలను పూడ్చినట్లు చెప్పారు.