నీట్ పరీక్షను రద్దు చేయాలి.. బీజేపీ ఆఫీస్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం

నీట్ పరీక్షను రద్దు చేయాలి.. బీజేపీ ఆఫీస్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం

హైదరాబాద్, వెలుగు: నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనా రెడ్డి డిమాండ్ చేశారు. ఆ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ ఆదివారం నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో శివసేనారెడ్డితో సహా కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా శివసేనారెడ్డి మీడియాతో మాట్లాడారు. నీట్ పరీక్ష పత్రం లీక్ కు పాల్పడిన నిందితులను విచారిస్తే బీజేపీ నేతల బండారం బయటపడుతుందని తెలిపారు. 

నీట్ లీకేజీలో 14 మంది కేంద్ర మంత్రుల ప్రమేయం ఉందని, వారి పిల్లల భవిష్యత్ కోసం నీట్ పేపర్ ను లీక్ చేశారని.. అసలు నిజాలు బయటపడితే కేంద్ర ప్రభుత్వం కుప్పకూలుతుందన్నారు. అందుకే నీట్ పరీక్షను రద్దు చేసేందుకు కేంద్రం వెనుకడుగు వేస్తుందని శివసేనారెడ్డి విమర్శించారు. నీట్ పేపర్ లీక్ కు నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  23 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటం ఆడుతోందన్నారు. పరీక్షను రద్దు చేయాలని లేని పక్షంలో పార్లమెంటును ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.