హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ వేదికగా యూత్ కాంగ్రెస్ నేతలు రెచ్చిపోయారు. పార్టీలో పదవుల కోసం కొత్తగూడెం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. నాయకులు సముదాయించిన వినకుండా తన్నుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన నేతలకు పార్టీలో పదవులు ఇవ్వడంపై మరో వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది.
వివాదం మరింత ముదరడంతో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. గాంధీ భవన్ వేదికగా యూత్ కాంగ్రెస్ నేతలు బాహాబాహీకి దిగడంపై సీనియర్ నేతలు ఫైర్ అవుతున్నారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోకుండా ఏకంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలోనే తన్నుకోవడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై దాడి సమయంలోనూ యూత్ కాంగ్రెస్ నేతల తీరుపై విమర్శలు వెలువెత్తాయి.
Also Read :- తెలంగాణ హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు
ఆందోళనలు ప్రజాస్వామయ్యుతంగా చేయాలని.. పార్టీ ఆఫీసులపై భౌతిక దాడులు చేయడం సరికాదని.. అది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ యూత్ కాంగ్రెస్ నాయకులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగానే.. యూత్ కాంగ్రెస్ నాయకులు ఏకంగా పార్టీ కార్యాలయంలోనే భౌతిక దాడులు చేసుకోవడంతో పార్టీ ఏ విధంగా రియాక్ట్ అవుతోందో చూడాలి.