- కొత్తగూడెం జిల్లా నేతల మధ్య గొడవ
- జిల్లా ప్రధాన కార్యదర్శి సుధీర్‌పై డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కార్తీక్ వర్గం దాడి
- వేరే పార్టీ నుంచి వచ్చినోళ్లకు పదవులు కట్టబెడ్తున్నారంటూ ఆగ్రహం
- రసాభాసగా స్టేట్ జనరల్ బాడీ మీటింగ్
హైదరాబాద్, వెలుగు: గాంధీభవన్‌లో కొత్తగూడెం జిల్లా యూత్ కాంగ్రెస్ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కీలక పదవులు కట్టబెడ్తున్నారంటూ ఆ జిల్లా పాత నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఏండ్ల నుంచి పార్టీకి సేవ చేస్తున్నా తమను గుర్తించడం లేదంటూ మండిపడ్డారు. జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సుధీర్‌పై డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కార్తీక్ వర్గీయులు దాడి చేశారు. దీంతో అరగంట పాటు గాంధీభవన్‌లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన జనరల్ బాడీ మీటింగ్ వేదికగా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు.
కొత్తగూడెం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చీకటి కార్తీక్‌ను నియమించడంపై ఆ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సుధీర్, అతని అనుచరులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. యూత్ కాంగ్రెస్ నిబంధనల ప్రకారం.. 35 ఏండ్లలోపు ఉన్న వారికే పదవులు ఇవ్వాల్సి ఉండగా, కార్తీక్ కు 38 ఏండ్లు ఉన్నాయని తెలిపారు. పైగా అతను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వ్యక్తి అని సుధీర్ తో పాటు అతని వర్గీయులు జనరల్ బాడీ మీటింగ్‌లో రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ దృష్టికి తీసుకెళ్లారు.
పార్టీలో మొదటి నుంచి ఉన్న తమను కాదని.. కొత్తగా వచ్చిన కార్తీక్ కు డిస్ట్రిక్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టడం ఏంటని నిలదీశారు. వెంటనే అతన్ని తప్పించాలని డిమాండ్ చేశారు. దీంతో అటు కార్తీక్, ఇటు సుధీర్ వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరికి ఒకరిని ఒకరు తోసుకుంటూ గొడవకు దిగారు. సమావేశం నుంచి బయటికి వచ్చాక గాంధీభవన్ ఆవరణలోనే అరగంట పాటు కొట్టుకున్నారు. కార్తీక్ వర్గీయులు సుధీర్‌పై మూకుమ్మడి దాడి చేశారు. చివరికి సీనియర్ నేతల జోక్యంతో రెండు వర్గాలు గాంధీభవన్ నుంచి వెళ్లిపోయాయి.
అన్ని పరిశీలించే నియమించాం: శివచరణ్ రెడ్డి
నిబంధన మేరకే కార్తీక్‌ను కొత్తగూడెం యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా నియమించామని స్టేట్ ప్రెసిడెంట్ శివ చరణ్ రెడ్డి స్పష్టం చేశారు. వయస్సుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతనే అతన్ని జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించామని చెప్పారు. గాంధీ భవన్ బయట జరిగిన గొడవ తనకు తెలియదని, ఏవైనా పొరపాట్లు ఉంటే దీనిపై సమీక్ష చేసుకుంటామని అన్నారు.