
- హెచ్‌సీయూ భూములపై ప్రజలకు నిజాలు చెప్పండి
- యూత్ కాంగ్రెస్ నేతలకు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పిలుపు
- పార్టీ కోసం బాగా పని చేయాలి: పొన్నం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూములపై ఏఐ టెక్నాలజీతో ప్రతిపక్షాలు అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని, సోషల్ మీడియా వేదికగా వాటిని తిప్పికొట్టాలని యూత్ కాంగ్రెస్ నేతలకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం గాంధీ భవన్ లో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డి అధ్యక్షతన కార్యవర్గం సమావేశం జరిగింది. దీనికి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఈ భూముల వివాదంపై ప్రజలకు వాస్తవాలు వివరించాలని యూత్ కాంగ్రెస్ నేతలకు చెప్పారు. సోషల్ మీడియాపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని, అందులో దూకుడుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని, కాని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యూత్ కాంగ్రెస్ పాత్ర తగినంతగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పదవులు తప్పకుండా వస్తాయని, రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా టికెట్లు ఇస్తామన్నారు.
సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. హెచ్‌సీయూ భూములపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేశాయని, దీనిని సోషల్ మీడియాతో పాటు జనంలో తిప్పికొట్టడంలో యూత్ కాంగ్రెస్ నేతలు ఆశించిన స్థాయిలో పని చేయలేదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని సూచించారు. పని చేసేవారికే రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్, ఇతర నేతలు పాల్గొన్నారు.