
- మరొకరికి సీరియస్ .. ఇంకొందరికి స్వల్పగాయాలు
- సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బాపూర్‌లో ఘటన
గజ్వేల్, వెలుగు: శివాజీ జయంతి సందర్భంగా జెండాను ఎగురవేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి యువకుడు మృతి చెందగా.. మరికొందరు గాయపడిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం వర్గల్ మండలం జబ్బాపూర్ లో శివాజీ జయంతి సందర్భంగా యువకులు లింగ ప్రశాంత్( 22), బేసెట్టి కరుణాకర్, కొంత వేణు, ఇంకా సహదేవ్, లింగ మహిపాల్‌తో పాటు మరికొందరు ఐరన్ పైప్ కు జెండాను కట్టి ఎగరవేయడానికి పైకి లేపారు.
జెండా గద్దెపై నుంచి 11 కేవీ విద్యుత్ తీగలు వెళ్తుండగా చూసుకోలేదు. దీంతో పైకెత్తిన జెండా పైపు తీగలకు తగిలి కరెంట్ షాక్ కొట్టి లింగ ప్రశాంత్ స్పాట్ లో చనిపోయాడు. కరుణాకర్ తీవ్రంగా.. కొంత వేణు, లింగ సహదేవ్, లింగ మహిపాల్ తో పాటు మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే గ్రామస్తులు గజ్వేల్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు ప్రశాంత్ ఇటీవలే ఎన్సీసీ శిక్షణ పూర్తి చేసి ఎగ్జామ్ కూడా పాస్ అయ్యాడు. ప్రశాంత్ మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.