ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

జగిత్యాల, వెలుగు: యువత ప్రతిభను వెలికితీయడానికే ప్రభుత్వం యువజనోత్సవాలు నిర్వహిస్తోందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్​పర్సన్ భోగ శ్రావణి అన్నారు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోని ఎస్కేఎన్ఆర్ కాలేజీలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి యువజనోత్సవాలను బుధవారం వారు ప్రారంభించారు. అనంతరం విజేతలకు మెమొంటోలు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్ లత, సంక్షేమ శాఖ అధికారి నరేశ్, ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు,

ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కేటీఆర్​కు లెటర్లు

సిరిసిల్ల టౌన్, వెలుగు : డబుల్ ఇండ్లు రానివారందరికీ స్థలంతోపాటు ఇల్లు కట్టుకోవడానికి రూ.5లక్షలు వెంటనే ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేశ్​డిమాండ్​ చేశారు. బుధవారం సిరిసిల్ల ఆర్డీఓ ఆఫీస్ ముందు సీపీఎం ఆధ్వర్యంలో 500 మంది మంత్రి కేటీఆర్​కు పోస్టు కార్డులు రాశారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చినా హామీలు నెరవేర్చలేదన్నారు. సిరిసిల్లలో ఎన్నోసార్లు డబుల్ ఇండ్ల కోసం దరఖాస్తులు తీసుకొని మొండి చేయి చూపారన్నారు. ఇప్పటికైనా మినిస్టర్​కేటీఆర్​స్పందించి లబ్ధిదారులకు సొంతింటి కల నెరవేర్చాలని లేకపోతే నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కోడం రమణ , సూరం పద్మ, లీడర్లు అజయ్, గోవిందు, లబ్ధిదారులు పాల్గొన్నారు. 

‘సాటా’ సేవలు అభినందనీయం

జగిత్యాల, వెలుగు: గల్ఫ్​ బాధితులకు సాటా(సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్) అందిస్తున్న సేవలు అభినందనీయమని జగిత్యాల కలెక్టర్​గుగులోత్​రవినాయక్​అన్నారు. సౌదీలో ఇటీవల మృతి చెందిన మొగిళ్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు బుధవారం స్థానిక కలెక్టరేట్ లో సాటా సభ్యుల ఆధ్వర్యంలో కలెక్టర్ రూ.2.5లక్షల విలువ గల చెక్కులను అందించారు. మృతదేహాన్ని స్వదేశానికి పంపించడానికి సహకరించడంతోపాటు మృతుడి కుటుంబానికి సౌదీ అరేబియాలోని సాటా ప్రతినిధులు కె. మహేశ్, పి.ముజ్జమ్మీల్ షేఖ్, మల్లేశన్ అధ్వర్యంలో విరాళాలు సేకరించి కలెక్టర్ ద్వారా అందజేసినట్లు నిర్వహుకులు తెలిపారు. 

బీజేపీని మరింత బలోపేతం చేయాలి

గోదావరిఖని, వెలుగు : భారతీయ జనతా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త పనిచేయాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక శారదానగర్‌‌‌‌ శిశుమందిర్‌‌‌‌ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో రామగుండంలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. సమావేశంలో పెద్దపల్లి జిల్లా ఇన్​చార్జి రావుల రామ్‌‌‌‌నాథ్‌‌‌‌, రామగుండం అసెంబ్లీ ప్రభారీ ఆరుముల్ల పోశం, కార్పొరేషన్‌‌‌‌ ఏరియా ప్రెసిడెంట్‌‌‌‌ లక్ష్మణ్, లీడర్లు సురేశ్, వెంకటరమణ, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ

సుల్తానాబాద్, వెలుగు: నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతాయని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి చిన్నకల్వల గ్రామం నుంచి దుప్పపల్లి వరకు(188 కిలోమీటర్లు) రాజీవ్ రహదారిపై 29 సీసీ కెమెరాలు, హైమాస్ లైట్లు, సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 52 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి కంట్రోల్ రూమ్ ను సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ లో బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సదర్భంగా సీపీ మాట్లాడుతూ సీసీ కెమెరాలతోనే 24 గంటల నిరంతర పర్యవేక్షణ సాధ్యమన్నారు. ఇందుకు కృషిచేసిన ఏసీపీ, సీఐ, ఎస్ఐలను ఆయన అభినందించారు. కార్యక్రమంలో డీసీపీ రూపేశ్, ఏసీపీ సారంగపాణి, సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్​ టాక్స్​ వెంటనే చెల్లించాలి 

తనిఖీల్లో దొరికితే భారీ జరిమానా

తిమ్మాపూర్, వెలుగు: ట్రాన్స్​పోర్ట్​ వెహికల్స్​ మూడు నెలలకోసారి రోడ్​ టాక్స్​ చెల్లించాలని, లేకపోతే వాహనాన్ని సీజ్ చేయడంతోపాటు భారీ జరిమానా విధిస్తామని ఉమ్మడి కరీంనగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ఎం.చంద్రంశేఖర్ గౌడ్ తెలిపారు. బుధవిరం మండలంలోని రవాణా శాఖ ఆఫీస్​లో కరీం నగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓవర్ లోడ్ తో వెళ్లే వాహనాలతోపాటు రోడ్ టాక్స్​ చెల్లించని వాహనాలు, ఫిట్ నెస్ లేని వెహికల్స్​పై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ భూమి లేని రవాణా శాఖ ఆఫీస్​ల అధికారులు సంబంధిత కలెక్టర్లను సంప్రదించాలని, భూమి ఉన్నవాళ్లు ఆఫీస్​బిల్డింగ్ లు నిర్మించుకోవాలని ఆదేశించారు. సమావేశం లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాల ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్లు కొండల్ రావ్, ఉమా మహేశ్వర్ రావు, నాగలక్ష్మి, సిరాజుద్దిన్, మసూద్ అలీ, రజనీ దేవి, వంశీధర్, కిశోర్ చంద్రా రెడ్డి, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

బాలుడికి ఆర్థిక సాయం..

కరీంనగర్ కోతి రాంపూర్ కు చెందిన ఆటో డ్రైవర్ సుబేదారి రమేశ్, సరిత కుమారుడు అజయ్(12) మస్క్యులర్ డిస్ట్రఫీ వ్యాధితో బాధ పడుతున్న విషయాన్ని తెలుసుకున్న రవాణా శాఖ అధికారులు రూ.20వేలను  చంద్ర శేఖర్ గౌడ్ చేతుల మీదుగా అందజేశారు.