చాంద్రాయణ గుట్టలో డబ్బుల కోసం కొట్టుకున్నారు..

చాంద్రాయణ గుట్టలో డబ్బుల కోసం కొట్టుకున్నారు..
  • ఇచ్చిన డబ్బులు తిరిగివ్వాలన్న వ్యక్తి
  • పెట్రోల్ పోసుకుని బెదిరించే సమయంలో మంటలంటుకుని గాయాలు 

 చాంద్రాయణగుట్ట,  వెలుగు: డబ్బుల కోసం జరిగిన గొడవలో ఇద్దరు యువకులకు మంటలంటుకుని తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఓల్డ్ సిటీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పటేల్ నగర్ బస్తీలో నివసించే శ్రీనివాస్ ఇంట్లో రాజు నాయక్ అనే వ్యక్తి అద్దెకు ఉంటున్నాడు. కొన్ని రోజుల క్రితం రాజునాయక్ కూతురు వివాహానికి శ్రీనివాస్ ఆర్థిక సాయం అందించాడు.  ఆ డబ్బులను తిరిగి ఇవ్వమని  శ్రీనివాస్ కొద్ది రోజులుగా రాజునాయక్ ను అడుగుతున్నాడు. 

మంగళవారం మరోసారి డబ్బుల విషయంలో శ్రీనివాస్, రాజు నాయక్ కుటుంబాల మధ్య గొడవ జరిగింది.  శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం11 గంటలకు రాజునాయక్ ఇంటికి వెళ్లాడు. డబ్బులు ఇస్తావా లేదా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవాలా అంటూ బెదిరించాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ కొడుకు మనీష్(16) తండ్రి వెంట తెచ్చుకున్న పెట్రోల్ డబ్బా లాక్కొని ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. రాజు నాయక్ కుమారుడు శివ(23) పెట్రోల్ పోసుకుంటున్న మనీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నివారించే ప్రయత్నం చేయగా.. మనీశ్, శివలపై పెట్రోల్ పడింది.  పక్కనే ఒక వ్యక్తి గులాబ్ జాములు, స్వీట్స్ తయారు చేస్తుండగా ఒక్కసారిగా మనీశ్, శివకుమార్ ఇద్దరికి మంటలంటుకుని గాయాలయ్యాయి.  గాయపడిన ఇద్దరిని పోలీసులు హాస్పిటల్ కు తరలించారు. ఛత్రినాక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.