బాచుపల్లిలో బొమ్మ తుపాకీతో బీటెక్​ స్టూడెంట్ల హల్​చల్

బాచుపల్లిలో బొమ్మ తుపాకీతో బీటెక్​ స్టూడెంట్ల హల్​చల్
  • బైండోవర్ చేసిన బాచుపల్లి పోలీసులు.. ఆలస్యంగా వెలుగులోకి..

జీడిమెట్ల, వెలుగు: బొమ్మ తుపాకీతో హల్​చల్​ చేసిన బీటెక్ ​స్టూడెంట్లను బాచుపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని బైండోవర్​చేశారు. ఈ నెల 13న ఈ ఘటన జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. బాచుపల్లి డాలర్ మిడోస్​కి చెందిన ముప్పిడి విశాల్​రెడ్డి, హరితవనం పద్మావతి ఫ్రైడ్​కి చెందిన కేతిరెడ్డి కౌశిక్​ రెడ్డి, నిజాంపేట కేటీఆర్ కాలనీ శ్రీసాయి ద్వారకా హైట్స్​కి చెందిన రావూరి చరణ్, పటాన్​చెరువు ఏపీఆర్ గ్రాండియర్​కి చెందిన దంతులూరి కౌశిక్​వర్మ ఒకే కాలేజీలో బీటెక్​చదువుతున్నారు. 

వీరంతా కలిసి 13న అర్ధరాత్రి 11.30 ప్రాంతంలో నిజాంపేట కేటీఆర్ కాలనీలో సినిమాల్లో ఉపయోగించే బొమ్మ తూపాకీతో హల్​చల్​చేశారు. దారిన పోయేవారిని షూట్​చేస్తున్నట్లు భయపెట్టారు. స్థానికుల ఫిర్యాదుతో బాచుపల్లి పోలీసులు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్నది బొమ్మ తుపాకీగా గుర్తించారు. కేసు నమోదు చేసి బొమ్మ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బాచుపల్లి తహసీల్దార్​​ ముందు హాజరుపరిచారు. ఈ ఘటన జరిగి 15 రోజులుకావస్తున్నా విషయాన్ని గోప్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.