బెట్టింగ్ మాయలో యువత

బెట్టింగ్ మాయలో యువత

ఒక ఆట, పోటీ ఫలితంపై, ప్రమాదం గురించి తెలిసి కూడా లాభం పొందాలి అనే ఆశతో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి డబ్బుతో కానీ విలువైన ఇతర వస్తువులతో కాని పందెం కాయడమే జూదం. దాన్నే మన ప్రస్తుత పరిభాషలో బెట్టింగ్ అంటున్నాం. సరైన పరిజ్ఞానం వల్ల లేదా యాదృచ్ఛికంగా అయితేనేమి ఊహించినవిధంగానే దీని ఫలితం రావచ్చు.  లేదా తప్పుడు లెక్కల కారణంగా ప్రతికూల ఫలితమైనా ఉండవచ్చు. పోతే బాధ, వస్తే సంతోషం. 

చరిత్ర తెలిపే సత్యం ఏమిటంటే జూదంలో సంపాదించినవారి కన్నా పోగొట్టుకున్నవారే అత్యధికం. అలవాటు లేని యువకులను సైతం ఉత్సాహపరిచేవిధంగా సామాజిక మాధ్యమాలలోనూ ఫోన్ కాల్స్​తో ఆకర్షణీయమైన పదజాలాన్ని వాడుతూ వారిని ఆకట్టుకుంటున్నారు. రోజుకు ఒక కొత్త బెట్టింగ్ యాప్ పుట్టిస్తూ క్యూఆర్ కోడ్ సహాయంతో బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తూ లక్షలకొద్దీ సొమ్ము చేతులు మారుస్తున్నారు.ఐపీఎల్ సీజన్లో నాలుగైదు రకాల సామాజిక మాధ్యమాల ద్వారా బెట్టింగ్ జోరు యధావిధిగా కొనసాగుతోంది.‌ పోలీసుల మెతక వైఖరి గమనించిన ప్రమోటర్లు తాము విడుదల చేసిన బెట్టింగ్ యాప్ లు న్యాయపరంగా సమ్మతమైనవే అంటూ ప్రకటనలు కూడా చేసుకుంటున్నారు.‌ 

ఐపీఎల్ సీజనే ఎందుకు ? 

దాదాపు ఏడు కోట్లకు పైగా ఆదాయాన్ని గడించే ఐపీఎల్ ప్రపంచ క్రీడా వ్యవస్థలోనే రెండో అతిపెద్ద టోర్నమెంట్. అందుకే బడా కార్పొరేటర్లు సైతం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఐపీఎల్ సీజన్ లో తమ బ్రాండ్ విలువ పెరిగేలా ప్రకటనలు గుప్పిస్తారు. ఆ ప్రకటనల వల్ల అపరిమితమైన ఆదాయం సమకూరుతుంది. 

టోర్నీ మొదలైన రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఐపీఎల్ టోర్నమెంట్​ను హర్షాతిరేకాలతో వీక్షిస్తూ పండుగ చేసుకుంటున్నారు. మన దేశంలో ఏ ఇతర టోర్నమెంట్​కు లేని ఆదరణ దీనికి ఉంది. అందుకే ఈ సీజన్​లో క్రికెట్ ప్రియులు క్రీడాస్థలాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కాలక్షేపం కోసం వినోదం కోసం టీవీలకు, స్క్రీన్​లకు అతుక్కుపోయి ఉత్సాహభరితంగా వీక్షిస్తారు. 

నగరాలు, పట్టణాలు, పల్లెటూళ్లలోనూ  క్రికెట్‌ ఫీవర్‌తో రెచ్చిపోతుంటారు. ఇదే అదనుగా తేలికగా డబ్బు సంపాదించుకోవాలనుకొనే బుకీలు ఈ సీజన్​ను ఒక అవకాశంగా మార్చుకుంటున్నారు.  అమాయక యువతకు ఎరవేసి, ప్రలోభ పెట్టి బెట్టింగ్ మాయాజాలంలో దింపుతున్నారు. సులభంగా సంపాదించగల బెట్టింగ్​పై అవగాహన కల్పిస్తూ, ఆశలు రేకెత్తించి రొంపిలోకి దించి చివరకు బుకీలు డబ్బులు దండుకుని సామాన్యులకు కుచ్చుటోపీ పెడతారు. 

బుకీల వ్యవహార తీరు 

బెట్టింగ్ ఆడేవాళ్లు జూదగాళ్లయితే బెట్టింగ్​కు ప్రోత్సహించి ఆడించేవాళ్లని బుకీలు అంటారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా టోర్నమెంట్ జరుగుతున్నంతకాలం తెలుగు రాష్ట్రాల్లో బుకీలు రెచ్చిపోతూ బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తూనే ఉన్నారు. డైరెక్ట్ బెట్టింగ్,ఆన్ లైన్  బెట్టింగ్ యాప్ ల పట్ల యువత, విద్యార్థులు ఎక్కువగా ఆకర్షితులయ్యే విధంగా రకరకాల  ప్రకటనలు గుప్పిస్తూ ఒక మ్యాచ్, ఓవర్ అనే కాదు, ఒక్కొక్క బాల్​కి ఒక్కొక్క రేటు పెట్టి  వేలకువేలు చేతులు మారుస్తూ, బుకీలు ఆన్​లైన్​లో కోట్ల రూపాయల టర్నోవర్  జరుపుతున్నారు. ముఖ్యమైన మ్యాచ్​ల గెలుపు, ఓటముల విషయంలో భారీ ఎత్తున పందాలు కాయిస్తారు. 

సహజంగానే బెట్టింగ్ చేసే వాళ్ళు తమ గెలుపు అవకాశాలను మెరుగుపరచుకోవడానికి చిట్కాల కోసం ఎదురు చూస్తుంటారు. అందుకే బుకీలు జట్టు బలాబలాలు, ఆటగాళ్ల ఫామ్, పిచ్ పరిస్థితులు, వాతావరణం, ప్రత్యర్థుల బలహీనతల ఆధారంగా కొన్ని చిట్కాలను సూచనాత్మకంగా రూపొందిస్తారు. వాటి ఆధారంగా జూదగాళ్ళు వారికి సురక్షితం అనుకున్న పందాలను ఎంచుకొంటారు. 

గెలుపు, ఓటమి ఆధారంగా సొమ్ము బదిలీ బుకీల ద్వారానే జరుగుతుంది. బెట్​ల  ఫలితాలపై పందెం వేసిన మొత్తం పైకం విజేతలకు చెల్లించాల్సిన దానికంటే ఎక్కువగా ఉండేలా బుకీలు జాగ్రత్త పడి లాభాన్ని సంపాదిస్తారు. బుకీలకు పాల్పడేవారు ప్రత్యేకమైన ఫోన్‌ నెంబర్‌లను వాడతారు. మ్యాచ్‌ ప్రారంభమయ్యే అరగంట ముందు మాత్రమే ఆ నెంబర్‌ను ఉపయోగించి మిగతా సమయంలో ఆ నెంబర్‌ స్విచ్ ఆఫ్ చేస్తారు. 

బెట్టింగ్ అడ్డాలు 

విద్యార్థులు, యువకులు అప్పు చేసి మరీ పెద్దమొత్తంలో గెలుపు, ఓటమిలపై బెట్టింగ్ కాస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వారిని ఆకర్షించేవిధంగా బార్​లలో, వ్యాపార సముదాయాల్లో, పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ అవకాశాన్ని వాడుకొని బెట్టింగ్‌ బంగార్రాజులు అక్కడే తిష్టవేసి క్రికెట్‌ జూదాన్ని నడుపుతున్నారు. మరికొందరు భావసారూప్యం గల యువకులు బృందాలుగా ఏర్పడి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూడడానికి ఒక సురక్షిత ప్రాంతంలో కూర్చొని  మద్యపానం చేస్తూ బొమ్మ బొరుసు ఆటతో కూడా వేలకొద్దీ రూపాయలు పెట్టి బెట్టింగ్​లు ఆడడం పరిపాటిగా  మారింది. 

పోలీసుల నిఘా పెరగాలి

ఆన్​లైన్,  ఆఫ్​లైన్ బెట్టింగులు, బుకీల కదలికలపై ప్రత్యేక పోలీసు నిఘా ఏర్పాటు చేసి, బెట్టింగ్​లకు అడ్డాలుగా మారిన లాడ్జీలు, గెస్ట్​హౌస్‌లు, దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, అనుమానాస్పద అపార్ట్​మెంట్ల  ఫ్లాట్లపై కన్నేసి ఉంచాలి. ఈ తరహా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిని వ్యవస్థీకృత నేరస్తులుగా పరిగణించి, కఠినమైన శిక్షలు విధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చట్టాల సవరణ కూడా అవసరమే. పబ్లిక్ జూదం చట్టం 1867 ప్రకారం జూదం ఆడితే విధించవలసిన శిక్షలు కూడా నామమాత్రంగా రూ.200 వరకు జరిమానా లేదా 3 నెలల వరకు జైలు శిక్షగా ఉన్నాయి. మహారాష్ట్రలాంటి కొన్ని రాష్ట్రాల చట్టాలు అధిక జరిమానాలతో, శిక్షలతో వారి సొంత చట్టాలను కలిగి ఉన్నాయి.

సామాజిక బాధ్యత 

బెట్టింగ్ ప్రలోభానికి యువత ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు. కాబట్టి వారిపై తల్లిదండ్రులు ప్రత్యేక నిఘా పెట్టాలి. మిత్రులు, హితులు, సామాజికవేత్తలు.. పిల్లల ప్రవర్తనలో ఏదైనా మార్పులు ఉన్నాయేమో గమనించి వారితో తరచూ మాట్లాడుతూ ఉండాలి. లేదంటే డబ్బులు, విలువైన ప్రాణాలు పోయే అవకాశం ఉంది. బెట్టింగులు కాస్తూ పోలీసులకు దొరికితే జీవితమే నాశనం అవుతుందని సామాజికవేత్తలు కూడా హితవు పలకాలి.  లేకుంటే భావిభారత పౌరుల జీవితాలు అంధకారంగా మారతాయి. ఒక కేసు విచారణలో భాగంగా ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, యూట్యూబర్లు, సెలబ్రిటీలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే తాము పర్యవసనాలను ఆలోచించుకోకుండా బెట్టింగ్ యాప్​లపై ప్రచారం చేసినట్లు చెప్పుకొస్తున్నారు. చట్టం గురించి తెలియదనడం ఒక సాకు కాకూడదు. సదరు సినీ ప్రముఖులు,  యూట్యూబర్లు, సెలబ్రిటీలే తమ దిద్దుబాటు చర్యలో భాగంగా బెట్టింగ్ యాప్​ల చెడు ప్రభావాలపై విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పిస్తూ ప్రకటనలు చేస్తే సభ్య సమాజం సంతోషిస్తుంది. యాప్ ప్రమోటర్లు, నిర్వాహకులు, ఆడేవారు ఈ మూడు వర్గాల వారిని కఠినమైన శిక్షలతో కట్టడి చేస్తేనే కానీ దీనికి ముగింపు పలకడం అసాధ్యం.‌

- ఆర్ సి కుమార్, సోషల్​ ఎనలిస్ట్​-–