ప్రతీ సంవత్సరం జనవరి 12 రాగానే, భారతీయులంతా యువ దినోత్సవం జరుపుకుంటారు. అందుకు ప్రధాన కారణం స్వామి వివేకానంద. ఆయన యూత్ ఐకాన్ గా ఎందుకు మారారు? ఆయన నుంచి యువత పొందే ప్రేరణ ఏముందో చర్చించాల్సిన అవసరం ఉన్నది. వివేకానంద1863 జనవరి12న పుట్టారు. ఆయన అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. బెంగాల్లో రామకృష్ణ పరమహంస దగ్గర శిష్యుడిగా చేరారు. మిగతా శిష్యుల లాగే అన్నీ నేర్చుకున్నారు. రామకృష్ణ దగ్గర అన్ని బోధనలూ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, యోగా వంటివి తెలుసుకున్న వివేకానంద, వాటిని అమెరికా సహా చాలా దేశాలకు వెళ్లి బోధించారు. అలా ఆయన భారత గొప్పదనాన్ని విదేశీయులకు చాటి చెప్పారు. అందుకే ఆయన యూత్ ఐకాన్ అయ్యారు.
చికాగో సభలో..
ఇండియాలో హిందూ ధర్మంలో కీలక సంస్కరణలు, మార్పులకు వివేకానంద శ్రీకారం చుట్టారు. భారతీయుల్లో ఐక్యతను పెంచారు. జాతీయతా భావాన్ని తట్టిలేపారు. ఆయన బోధనలు, సందేశాలూ యువతను సన్మార్గంలో నడిపించాయి. అందుకే ఆయన యూత్ ఐకాన్ అయ్యారు. 1893లో అమెరికా చికాగోలోని ప్రపంచ మతాల సదస్సులో ఆయన ప్రపంచమే ఆశ్చర్యపోయేలా చరిత్రాత్మక సందేశం ఇచ్చారు. అమెరికన్లు జనరల్‌గా లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటూ ప్రసంగం మొదలుపెడతారు. కానీ వివేకానంద.. సోదర, సోదరీమణులారా అంటూ ప్రసంగించి... అక్కడి వారందర్నీ ఆశ్చర్యపరిచారు. అన్ని మతాల సారమూ ఒక్కటేనని చెప్పడం ద్వారా సర్వమత సమానత్వాన్ని చాటిచెప్పారు.
హైదరాబాద్‌తో విడదీయరాని బంధం
దేశానికి యువతే పట్టుకొమ్మలని, వారు సంకల్ప బలంతో ఏదైనా సాధించగలరని స్వామి వివేకానంద ఎన్నో ప్రసంగాలు చేశారు. కానీ ఆయనకు అరుదైన అవకాశాన్ని ఇచ్చింది హైదరాబాద్ మహానగరం. వివేకానంద పేరు చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చేది చికాగో సర్వమత సమ్మేళనంలో ఆయన చేసిన ప్రసంగం. కానీ అంతకుముందే సికింద్రాబాద్ మెహబూబియా కళాశాల వేదికగా1893, ఫిబ్రవరి13న చేసిన ప్రసంగమే ఆయన తొలి ప్రసంగం.‘మై మిషన్ టు ది వెస్ట్’ అని చికాగో సమ్మేళనానికి వెళ్లడానికి కారణాలను వివరించారు. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఆయన ప్రసంగం చేయడంతో నిజాం సంస్థానం నుంచి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు వందలాదిగా సమావేశానికి హాజరై ఉత్తేజితులయ్యారు. అప్పటి నిజాం రాజు ప్రధాని అయిన మహారాజా కిషన్ ప్రసాద్, ముస్లిం రాజులు అమెరికా, చికాగో పర్యటనకయ్యే మొత్తం ఖర్చులను భరిస్తామని ముందుకురాగా వివేకానంద సున్నితంగా తిరస్కరించారు.
భారతీయుల్లో ఉన్న స్ఫూర్తి, పట్టుదలే..
స్వామి వివేకానంద భారతదేశంలో భవ్యమైన వర్తమాన కాలానికి, దివ్యమైన భవిష్యత్తు కాలానికి వారధిగా నిలిచారు. నేడు దేశ జనాభాలో అత్యధికులు 35 ఏండ్లలోపు వారే కావడం మన భారతదేశం అదృష్టం. గత ఎనిమిదేండ్లుగా వివేకానంద స్ఫూర్తితో యువతను దేశ ప్రగతి వైపునకు నడిపించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను తీసుకువచ్చింది. మన దేశంలో 2014కు ముందు ప్రతి సంవత్సరానికి సరాసరి నాలుగు వేల పేటెంట్ లు ఉండేవి. ప్రస్తుతం ఈ సంఖ్య ఏటా15 వేలకు పైగా పెరిగి, దాదాపు నాలుగింతలైంది. 26 వేల కొత్త స్టార్ట్-అప్ లను ఏర్పాటు చేయడం అనేది ప్రపంచంలో ఏ దేశానికైనా ఒక కలే.. కానీ ఈ స్వప్నం ప్రస్తుతం భారతదేశంలో 61,400 స్టార్ట్-అప్ లతో రూపందాల్చింది. కేవలం భారతీయుల్లో ఉన్న స్ఫూర్తి, పట్టుదల, కృషి దేశాన్ని ప్రగతి వైపునకు నడిపిస్తున్నది. ‘దేశాన్ని నిర్మించే కార్యం నాది. దీన్ని నేను పూర్తి చేయాల్సి ఉంది’ అనే భావన నేటి యువతలో నిండి ఉంది. దేశ యువత ఈరోజు కొత్త యాప్స్ తయారు చేస్తున్నది. వాటి తాలూకు ఫలితాలు వారికి మాత్రమే గాక దేశ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. సాంకేతిక విజ్ఞానం ద్వారా నేటి యువత వారి మెదడుకు పదును పెడుతూ దేశంలో వేలాది సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నారు.
ప్రతి కార్యక్రమంలో యువత భాగస్వామ్యం
మన యువత స్వచ్ఛ్ భారత్ అభియాన్ కు నేతృత్వం వహిస్తున్నది. యువ శక్తిని జాతీయ శక్తిగా తీర్చిదిద్దేందుకు ఒక బృహత్ ప్రయత్నం దేశంలో మొదలైంది. నైపుణ్యాలను పెంపొందించడం మొదలుకొని ముద్ర రుణం వరకు కేంద్రం యువతను స్వావలంబన వైపునకు నడిపిస్తున్నది. స్టార్ట్-అప్ ఇండియా, స్టాండ్- అప్ ఇండియా, ఫిట్ ఇండియా ప్రచార ఉద్యమం, ఖేలో ఇండియా.. ఇలా ప్రతీది యువతను భాగస్వామ్యం చేసేదే. 21వ శతాబ్దపు డిమాండ్లకు అనుగుణంగా మన విద్యావిధానాన్ని పున:సమీక్షించుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా నూతన జాతీయ విద్యావిధానం రూపంలో తీసుకొచ్చిన మార్పులు దేశాన్ని మరోసారి విశ్వగురువుగా మార్చే దిశగా సాగుతున్నాయి.
డా. కె. లక్ష్మణ్,
రాజ్యసభ సభ్యులు,
ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు