వనపర్తి జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న బాధితులు

వనపర్తి, వెలుగు : వనపర్తి జిల్లాలో యువత గంజాయికి బానిసలుగా మారుతున్రు. వివిధ ప్రాంతాల నుంచి నేరుగా గ్రామాలకు బైక్ పై గంజాయి సప్లై చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు. తాజాగా వనపర్తి జిల్లా పానగల్  మండల కేంద్రంలో బైక్ పై రెండు కిలోల గంజాయి తరలిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. యువకుడు వీపనగండ్ల మండలం తుంకుంట గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు.

ఏపీ నుంచి నల్లమల అటవీ ప్రాంతం గుండా తెలంగాణలోకి పెద్ద ఎత్తున గంజాయి వస్తున్నట్లు అనుమానిస్తున్నారు. కిలో గంజాయి రూ.10 వేలకు పైగా ధర పలుకుతుండడంతో కొందరు యువకులు దీనిని తరలిస్తూ తమ స్నేహితుల ద్వారా వ్యాపారం చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది.  

 గంజాయి బారిన ప్రముఖుల పిల్లలు..

గంజాయి మత్తుకు అలవాటు పడిన వారిలో ప్రముఖుల పిల్లలు ఉండడంతో, వారిని అదుపులోకి తీసుకొని వదిలేసినట్లు విమర్శలున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఒక వైపు కర్నాటక మరోవైపు నల్లమల అటవీ ప్రాంతం, హైదరాబాద్  నగరాలు ఉండడంతో గంజాయి స్మగర్లు వనపర్తి జిల్లాను సేఫ్ జోన్ గా మార్చుకున్నారని అంటున్నారు. రైలు, రోడ్డు మార్గాలతో పాటు కృష్ణానది మీదుగా పుట్టిల్లో గంజాయిని రవాణా చేస్తున్నారు. ఇందులోభాగంగానే కృష్ణానది తీరంలోని వీపనగండ్ల నుంచి గంజాయి తరలిస్తుండగా పోలీసులకు ఓ వ్యక్తి దొరికాడు.

ALSO READ: పత్తి దిగుబడిపై దిగులు

గత ఏడాది గంజాయి తాగుతున్నారనే ఆరోపణలతో జిల్లాలో 240 మందిని అదుపులోకి తీసుకొని పేరెంట్స్​ సమక్షంలో కౌన్సిలింగ్  ఇచ్చి వదిలిపెట్టారు. వీరిలో కొందరు ప్రముఖుల పిల్లలు ఇప్పటికీ గంజాయి వాడుతున్నారనే ఆరోపణలున్నాయి. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాపై పోలీసులు దృష్టి పెట్టడం లేదనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా గంజాయి అక్రమ రవాణాపై దృష్టి పెట్టి యువత గంజాయి బారిన పడకుండా చూడాలని కోరుతున్నారు. 

మత్తు సరిపోక..

మద్యానికి బానిసైన వారు మత్తు సరిపోక గంజాయికి అలవాటు పడుతున్నారని అంటున్నారు. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా రాత్రి 7 గంటల నుంచి గంజాయి వ్యాపారం మొదలవుతున్నా పట్టించుకోవడం లేదంటున్నారు. గతంలో గంజాయిపై ఉక్కు పాదం మోపిన ప్రభుత్వం ఈ మధ్య పట్టించుకోవటం లేదని విమర్శలున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఒక్కో జిల్లాలో వెయ్యి మంది వరకు గంజాయికి బానిసలైనట్లు పోలీసుల రికార్డులే చెబుతున్నాయి. గంజాయికి బానిసలవుతున్న తమ పిల్లలను ఈ వ్యసనం నుంచి బయటపడేలా చేసేందుకు పేరెంట్స్​ ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు.