దేశాభివృద్ధిలో యువత కీలకం

దేశాభివృద్ధిలో యువత కీలకం
  • మారుతున్న టెక్నాలజీకి తగ్గట్లు వారిని తీర్చిదిద్దాలి: మోదీ

న్యూఢిల్లీ: దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆర్టిఫిషియల్  ఇంటెలిజెన్స్, మెషీన్  లర్నింగ్  వంటి మారుతున్న టెక్నాలజీకి  అనుగుణంగా వారిని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆ దిశగానే తమ ప్రభుత్వం ‘యూత్ సెంట్రిక్’ విధానాలను అవలంబిస్తునదని తెలిపారు. గురువారం ‘వీర్ బాల్  దివస్’ కార్యక్రమంలో ఆయన మాట్లా డారు. వివిధ రంగాల్లో వస్తున్న మార్పులు, సవాళ్లను స్వీకరించాలని యువతకు ప్రధాని సూచించారు. ఏ రంగాన్ని ఎంచుకున్నా ఉత్తమ పనితీరు కనబర్చాలన్నారు.

 యంగ్  టాలెంట్ కు అండగా ఉండేందుకు, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. సవాళ్లను ఎదుర్కొనేలా యువతను సన్నద్ధం చేయడం అత్యంత అవసరమన్నారు. గురు గోవింద్  కుమారులు అసమాన ధైర్యసాహసాలు కనబరచి దేశం కోసం ప్రాణత్యాగం చేశారని కొనియాడారు. ‘‘మొఘల్  రాజుల అణచివేతకు ఆ బాలలు (షాహిబ్ జాదాస్) వ్యతిరేకంగా వారు పోరాడారు. ఎన్ని చిత్రహింసలు పెట్టినా, ఎన్ని ఆశలు చూపినా మొఘల్  రాజులకు వారు తలొగ్గలేదు. 

పదేండ్ల పసిప్రాయంలోనే దేశమే ముఖ్యం అనుకుని దేశం కోసం ఆ బాలలు ప్రాణత్యాగం చేసి మనందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ఆ షాహిబ్ జాదాల ధైర్యసాహసాలు, త్యాగాల మీదే మన ప్రజాస్వామ్యం నిర్మాణమైంది” అని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్  విజేతలతో మోదీ సంభాషించారు. కళలు, సంస్కృతి, ఆవిష్కరణలు, సైన్స్  అండ్  టెక్నాలజీ, క్రీడలు వంటి రంగాల్లో అసాధారణ కృషి చేసిన 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 17  మంది బాలలను మోదీ సన్మానించారు.